చిక్కుడు దొరకడు

అనూహ్యమైన, విచిత్రమైన స్థితిలో ముఖ్యమంత్రి అయిన రోశయ్య ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. ముఖ్యమంత్రిగా రోశయ్య సమర్థులు కారని వైయస్ అనుచరవర్గం, వైయస్ జగన్ నాయకత్వాన్నికోరుకుంటున్న లాబీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆ పదవిని నిర్వహించడం రోశయ్యకు తప్ప మరొక్కరికి సాధ్యమయ్యే పని కాదు. ఈ వాతావరణంలో ఆయన చిక్కుడు దొరకడు అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు.
జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెసు అధిష్టాన వర్గం ఇష్టంగా లేదని ఒక వైపు సంకేతాలు అందుతుండగా, తానే ముఖ్యమంత్రిగా మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తున్నా ఆయనలో మార్పు కానరావడం లేదు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తననెంతో కృంగదీసిందని, వైయస్ మరణం వల్ల పార్టీ అధిష్టాన వర్గం అప్పగించిన బాధ్యతను బాధతోనే నిర్వర్తిస్తున్నానని ఆయన అన్నారు.
పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తానని ఆయన చెబుతున్నారు. అధిష్టానం పట్ల విధేయతే తాను ఈ బాధ్యతను నిర్వహించాల్సి వస్తోందని ఆయన అన్నారు. జగన్ వర్గీయలకు కోపం రాకుండా ఆయన మాట్లాడుతున్నారు. తనకు ఏ మాత్రం ముఖ్యమంత్రి పదవి ఆశ లేదనే పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిలా తాను దూకుడుగా వెళ్లలేనని, అయితే అనుభవంతో పని చేయగలనని ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రజాభిమానం తన నాయకత్వంలోనూ పొందేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అందించడం ద్వారా పార్టీకి మద్దతును సంపాదించుకోవచ్చునని ఆయన అన్నారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రత్యామ్నాయం కానని, అయితే పేదల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల పార్టీకి మద్దతు కూడవచ్చునని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. ఇలా అంటూనే ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన ఎంత కాలం జగన్ వర్గీయుల అసమ్మతిని తట్టుకుని నిలబడగలరనేది ప్రశ్నార్థకమే.












Click it and Unblock the Notifications