కాంగ్రెస్ తో 'చిరు'ఒప్పందం

ఇటీవల వరకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజారాజ్యం ఇప్పుడు కాంగ్రెస్ కు అనుకూలంగా మారిందన్న ప్రచారంతో అంతర్గత వ్యవహారాలు బాగా వేడెక్కాయి. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లనే చిరంజీవి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఆయనకు కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ లేదని కొందరు వాదిస్తున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారనడానికి స్పీకర్ ఎన్నిక ఉదంతమే కాక మరో దృష్టాంతరం ఉందని ప్రజారాజ్యం సీనియర్లు చెబుతున్నారు. టెక్కలి కాంగ్రెస్ రేవతీ పతి మృతి తర్వాత అక్కడ ఆయన కుటుంబసభ్యులు పోటీ చేస్తే పోటీ పెట్టరాదని ప్రజారాజ్యం నిర్ణయించినట్టు చిరంజీవి చెప్పడం విమర్శలకు తావిచ్చింది. తెలుగుదేశం తన అభ్యర్ధిని నిలబెడితే ప్రజారాజ్యం అనివార్యంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఇదే జరిగితే ప్రజారాజ్యం కాంగ్రెస్ కు అనుకూలమన్న భావన బలపడుతుందని. దీర్ఘకాలంలో ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని ప్రజారాజ్యం మేధావుల ఆందోళన. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సమాన దూరం పాటించడం అవసరమని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమవుతుందని వీరి వాదన. ఈ విషయంలో కూడా పార్టీ తొందర పడిందని కొందరు సీనియర్ నాయకులు చిరంజీవి వద్ద ప్రస్తావించగా, మానవతా దృక్పధంతో రేవతిఈ పతి సతీమణికి మద్దతు ప్రకటించినంత మాత్రాన కాంగ్రెస్ కు అనుకూలమని ప్రచారం చేయడం దారుణమని ఆయన బాధపడినట్టు తెలిసింది. ఇలాంటి ప్రచారాన్ని ఖండించవలసిన సీనియర్లు వీటిని నమ్మడం విచారకరమని చిరంజీవి అంటున్నారు.
ఎన్నికల ఫలితాల రోజునే కాంగ్రెస్ తో ప్రజారాజ్యం మ్యాచ ఫిక్సింగ్ జరిగిందని ఒక ప్రచారం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కు కొన్ని సీట్లు తగ్గితే ప్రజారాజ్యం మద్దతు తీసుకోడానికి, దానికి తగిన మూల్యం చెల్లించడానికి ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు. తొలి ఫలితాలను బట్టి తమకు ఇరవై లోపే స్ధానాలు వస్తాయని గ్రహించిన ఆ పార్టీ ఇద్దరు అగ్రనేతలు కాంగ్రెస్ ప్రధాన దూతలతో సమావేశమై మద్దతును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రజారాజ్యం మీద కాంగ్రెస్ ముద్రపడితే కష్ట్మని కొందరు పార్టీ ముఖ్యులు లబోదిబో అంటున్నారు.












Click it and Unblock the Notifications