పార్టీల్లో ప్రాంతీయ చీలిక

ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ సమస్య సున్నితమైందని సీమాంధ్ర మంత్రి పార్థసారథి అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాక ముందే వాటాల గొడవలు పెట్టడం సరైంది కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పరీక్ష నిర్వహించడమే సమంజసమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, గాదె వెంకటరెడ్డి కూడా పరీక్ష నిర్వహించాలని అన్నారు. ఏమైనా అంటే ఆంధ్ర అని మాట్లాడుతున్నారని ఆయన నొచ్చుకున్నారు. పాత సంప్రదాయాల ప్రకారం నడుస్తుంటే అభ్యంతరపెడుతున్నారని ఆయన అన్నారు. ఇలా అయితే పాలన సాగించడం కష్టమని కూడా ఆయన అన్నారు. ప్రతిదాన్నీ వివాదంగా మార్చడం పరిపాటి అయిందని ఆయన అన్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు పరీక్ష నిర్వహణపై తీవ్రంగా ప్రతిస్పందించారు. విద్యార్థులతో పాటు తాము ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రోశయ్య తీరును కూడా వారు తప్పు పట్టారు.
తెలుగుదేశం పార్టీలోనూ ప్రాంతాలవారీగా నాయకులు చీలిపోయారు. పరీక్ష వాయిదా వేయాల్సిందేనని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల్లో తెలంగాణ వాటా 42 శాతం తేల్చిన తర్వాతనే పరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. కాగా, పరీక్ష నిర్వహించాలని సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు పయ్యావుల కేశవ్, గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. తమ విద్యార్థుల అభిమతం మేరకు తాము పరీక్ష నిర్వహించాలని కోరుతున్నట్లు గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. శైలజానాథ్ వంటి కాంగ్రెసు శాసనసభ్యులు కూడా పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. మొత్తం మీద, గ్రూప్ వన్ పరీక్ష మరోసారి తెలంగాణ, సీమాంధ్రల మధ్య చిచ్చు పెట్టింది.












Click it and Unblock the Notifications