కెసిఆర్ వర్సెస్ కోదండరామ్

పరీక్షల సమయం కావడంతో ప్రభుత్వం మిలియన్ మార్చ్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలను తెలంగాణ రాజకీయ జెఎసికి వ్యతిరేకంగా మలచి, దానిపై వ్యతిరేకత పెంచడానికి వాడుకుంది. మిలియన్ మార్చ్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఒత్తిడికి వాయిదా వేసుకునేలా చేయాలని ప్రయత్నించింది. ఈ స్థితిలో కెసిఆర్ మిలియన్ మార్చ్‌ను వాయిదా వేయించడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు చెబుతారు. మిలియన్ మార్చ్‌ను వాయిదా వేసుకుంటే వెనక్కి తగ్గిన భావన ఏర్పడి, ఉద్యమం దెబ్బ తినే ప్రమాదం ఉందని రాజకీయ జెఎసి గుర్తించింది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా దాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. మిలియన్ మార్చ్‌కు తెరాస ఏ మాత్రం సహకరించలేదని, తాము సహకరించకపోతే కార్యక్రమం విఫలమవుతుందని కెసిఆర్ భావించినట్లు చెబుతారు.
మిలియన్ మార్చ్‌కు పెద్ద యెత్తున ప్రజలు కదిలిరావడంతో కెసిఆర్ దిగి వచ్చి హైదరాబాదులోని ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. అయితే, ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ ఉద్యమాన్ని తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించిన కెసిఆర్‌కు ఇదే దెబ్బనని చెప్పాలి. ఆందోళనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో కంగు తిన్న కెసిఆర్ వెనక్కి వెళ్లిపోయారు. కోదండరామ్‌తో విభేదిస్తూ మిలియన్ మార్చ్ విషయంలో అనుసరించిన వ్యతిరేక వైఖరి కెసిఆర్ రుచి చూడాల్సి వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డికి ఆందోళనకారుల నుంచి సానుకూలత వ్యక్తమైంది. కాంగ్రెసు, తెలుగుదేశం, తెరాస, సిపిఐ తెలంగాణ ప్రాంత నాయకులు మొక్కుబడిగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అంటున్నారు. తాము తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని అనిపించుకోవడానికి మాత్రమే పని చేశారు తప్ప మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయడానికి పూనుకోలేదని చెబుతారు. ఈ విషయం మిలియన్ మార్చ్ సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైనట్లు తెలుస్తోంది.