బొత్సపై కత్తులు నూరుతున్న కిరణ్

బొత్స తీరుపై కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెవిన కూడా బొత్స సత్యనారాయణ తీరును వేసినట్లు సమాచారం. ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూరుస్తూ, ఆధిపత్యం సాధించాలని బొత్స ప్రయత్నిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కూడా మంత్రి పదవికి బొత్స రాజీనామా చేయకపోవడం కిరణ్ కుమార్ రెడ్డికి నచ్చడం లేదని అంటున్నారు. మంత్రిగా ఉంటూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారని అంటున్నారు.
బొత్స సత్యనారాయణ ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రకటనలు చేస్తున్నారని, మీడియాలో తానే సుప్రీం అన్నట్లుగా మాట్లాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. కాగా, కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారాల శైలిపై అప్పటికే బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద, కాంగ్రెసులో చిరంజీవి, బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మూడు ముక్కలాట నడుస్తోంది.












Click it and Unblock the Notifications