వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు చేవ లేదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
అపర చాణక్యుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితుల్లో చేవ లేకుండా ఉండిపోయాడా అంటే అవుననే అనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంలో మంచి ఉత్సాహం కనిపించాలి. కానీ తెలుగుదేశంలో ఏ ఉత్సాహమూ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే టిడిపి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రం కాంగ్రెసులోని ఏర్పడిన సంక్షోభాన్ని సొమ్ము చేసుకోలేని వైనం, సీమాంధ్రలో జగన్‌ను ఎదుర్కోలేని గడ్డు పరిస్థితి, తెలంగాణ, సమైక్యాంధ్రవాదాలపై ఏ వైపు నిలబడాలో తెలియని విచిత్ర పరిస్థితి. ఇవన్నీ కాదన్నట్లు టిడిపిలో ప్రాంతీయ అంతర్గత పోరు. ప్రాంతీయం పోరులోనూ కుమ్ములాటలు. ఇదీ తెలుగుదేశం తాజా పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని అయోమయంలో చంద్రబాబు పడినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన 30వ మహానాడు వేదికపై రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులలో కొత్త ఉత్సాహం తీసుకు వచ్చినట్టు కనిపించినప్పటికీ అది కొద్ది రోజులు మాత్రమే కనిపించింది. తెలంగాణ కోసం తెలంగాణ టిడిపి నేతలు రాజీనామా చేసిన సమయంలోనూ తెలంగాణ టిడిపి శ్రేణులలో ఉత్సాహం కొట్టొచ్చింది. వారి బస్సు యాత్రకూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఆ ప్రాంత టిడిపిలో ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. అది ఏ స్థాయికి వచ్చిందంటే మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసే స్థాయికి.

ఇన్నాళ్లు తెలంగాణలో స్తబ్దగా ఉన్న పార్టీ శ్రేణులలో రాజీనామాల కారణంగా ఒక్కసారిగా నూతన ఉత్సాహం కనిపించింది. కానీ కరీంనగర్ వరకు జరిగిన బస్సు యాత్ర సాఫీగా సాగినప్పటికీ వరంగల్ జిల్లాకు యాత్ర చేరుకోగానే తెలంగాణ సీనియర్లు మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర రావు మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో టిడిపి శ్రేణులలో పొంగిన ఉత్సాహం ఒక్కసారిగా తుడిచి పెట్టుకు పోయింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీని మరిపించే విధంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఏకంగా అధిష్టానానికి నిత్యం సవాళ్లు విసురుతూ ప్రజలలో సానుభూతి పొందుతున్నారు. అందుకు విరుద్దంగా తెలంగాణ టిడిపి నేతలు రెండు కళ్ల సిద్దాంతం అంటూ ప్రవచించిన చంద్రబాబు ఫోటో పెట్టుకుంటూ నిత్యం ఆయన స్మరణ చేస్తూ ప్రజల్లో గందరగోళ పరిస్థితిని నెలకొల్పుతున్నారు. అంతేకాదు తెలంగాణ టిడిపి నేతలు బస్సుయాత్ర చేపట్టగానే సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు ఇరు ప్రాంతాల వారికీ అడ్డు చెప్పలేదు. దీంతో ఇటు తెలంగాణ బస్సు యాత్రకు ఓకె చెప్పి అటు సమైక్యాంధ్ర పాదయాత్రకు బాబు మద్దతు పలుకుతున్నారని పలువురు గుప్పిస్తున్న ఆరోపణలకు టిడిపి వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ విషయాలన్నింటి పైనా చంద్రబాబు మౌనంగానే కనిపిస్తున్నారు. అదే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల విషయంలో కాంగ్రెసు స్పందించి వారికి హెచ్చరికలు జారీ చేసింది.

సీమాంధ్రలో వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో చంద్రబాబుకు మరో అగాధం ఉంది. ఇన్నాళ్లూ గుంటూరు, ఉభయ గోదావరి, శ్రీకాకుళంతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. కానీ తెలంగాణలో ఉద్యమం కారణంగా ఇప్పటికే టిడిపి తుడిచి పెట్టుకు పోగా సీమాంధ్ర ప్రాంతంలో జగన్ బాగా దెబ్బకొడుతున్నాడు. సీమాంధ్రలో టిడిపిని మరమ్మతు చేయడంపై చంద్రబాబు దృష్టి సారించినట్లుగా కనిపించడం లేదు. ఆ మాటకొస్తే సీమాంధ్రలో అయినా, తెలంగాణలో అయిన మరమ్మతు కోసం చంద్రబాబు శ్రద్ధ చూపినట్లుగా కనిపించడం లేదు. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పాలనలో తీవ్రంగా విఫలం అవుతున్నా విపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో చంద్రబాబు విఫలం అవుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్‌లు పెట్టి విమర్శించడం తప్పితే ఆయన చేసిందేమీ లేనట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం వైఫల్యంపై టిడిపి మినహా మిగిలిన విపక్షాలే ప్రజలలోకి బాగా వెళుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ, సమైక్యాంధ్ర, ప్రభుత్వ వైఫల్యం, సీమాంధ్రలో జగన్ ప్రభావం వీటన్నింటి పైనా చంద్రబాబు నోరు మెదపని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నట్టుగా కనిపిస్తోంది.

English summary
It seems Telugudesam party president Nara Chandrababu Naidu is very weak to reveal government failures, solve telangana and seemandhra issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X