రాజకీయ సన్యాసం తీసుకుంటా.. కేటీఆర్ సంచలన సవాల్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తున్నాయి. ప్రభుత్వం పైన బీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే విధంగా వరుస సమావేశాలతో క్షేత్ర స్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం పైన విమర్శలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఓపెన్ సవాల్ చేసారు. ఇప్పుడు ఈ సవాల్ రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
తమ హయాంలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.పేదలు తెలియక ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుంటే జీవో 58, 59 కింద పట్టాలు ఇచ్చామని చెప్పారు. రెండు న్నర లక్షల మంది పేదలకు పట్టాలు ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ రెండున్నరేళ్లలో హైదరాబాద్‌లో ఒక్క ఇంటినైనా కట్టారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ శనివారం, ఆదివారం నాడు ఇండ్లు కూలగొట్టారని కేటీఆర్ మండిపడ్డారు. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారని.. ఇల్లు పోతుందనే భయంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టలేదు.. కానీ కూలగొట్టిన ఇండ్లు వేలల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇండ్లు కూలగొట్టే ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.

కేటీఆర్ వరుస సమావేశాలతో..
గుంపు మేస్త్రీ అంటే ఇళ్లను కట్టాలి కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇళ్లను కూలగొడుతున్నాడని మండిపడ్డారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకున్నారని.. తెలంగాణలో మాత్రం ఆ దరిద్రాన్ని తెచ్చుకున్నామని అన్నారు. దొంగ గ్యారంటీ కార్డులతో కొంప ముంచారని మండిపడ్డారు. కేసీఆర్ కల్యాణ లక్ష్మీకి రూ.లక్ష ఇస్తే.. కాంగ్రెస్ వాళ్లు అదనంగా తులం బంగారం ఇస్తామని అన్నారని గుర్తుచేశారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ఒక్క రూపాయి అయినా పెన్షన్ పెంచిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయ్యిందని.. ఒక్కరికైనా రూ.2500 వచ్చాయా అని అడిగారు. కోడలుకు రూ.2500 ఇస్తామన్నాడని.. అత్తకు 4వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాడని తెలిపారు. ఇలా ప్రతి వర్గానికి శఠగోపం పెట్టారని విమర్శించారు. కేసీఆర్ ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికీ మంచినీటి గోస తీర్చారని కేటీఆర్ తెలిపారు. ఏడాదిన్నరలోనే కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని పేర్కొన్నారు. 2028లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications