జగన్ అరెస్టుకు, తెలంగాణకు లింకేమిటి?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయాలు వైయస్ జగన్‌తో ముడిపడి ఉన్నట్లు కాంగ్రెసు అధిష్టానం నమ్ముతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, వైయస్ జగన్ చేతులు కలిపారనే ప్రచారం సాగుతోంది. తన వర్గానికి చెందిన శాసనసభ్యులను వైయస్ జగన్ తెరాసలోకి పంపిస్తున్నారని, తెలంగాణలో వాతావరణం తన పార్టీలోకి నేరుగా శాసనసభ్యులు వచ్చే అవకాశాలను ఇవ్వకపోవడం వల్ల ఆ వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారని అంటున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని తెరాసలోకి పంపి, వచ్చే శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వాన్ని కూల్చాలని జగన్ ఎత్తులు వేసినట్లు చెబుతున్నారు.
తెలంగాణ సమస్యను కాంగ్రెసు అధిష్టానం ప్రజల ఆకాంక్ష నుంచి కాకుండా తెలంగాణలో రాజకీయ పార్టీలు, నాయకత్వం కోణం నుంచి చూసి, అదే రీతిలో దాన్ని పరిష్కరించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆ కారణంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని బలహీనపరిస్తే తెలంగాణలో తమ పార్టీ నుంచి తెరాసలోకి వలసలు ఆగిపోతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు శాసనసభ్యులు తెరాసలోకి మారిన నేపథ్యంలో ఈ కోణం ముందుకు వచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం వెల్లడించాలనే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెసుకు చెందిన చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికి వీలైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే కెసిఆర్‌తో కలిసి ప్రభుత్వానికి జగన్ ముప్పు తేవచ్చునని భావిస్తున్నారు. ఎటు చూసినా జగన్ ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో జగన్ అరెస్టుకూ తెలంగాణపై నిర్ణయానికీ లింక్ పెడుతున్నట్లు పుకార్లు చెలరేగుతున్నాయి.
అయితే, ప్రస్తుత పరిస్థితిలో జగన్ అరెస్టు జరుగుతుందనేది కేవలం ఊహ మాత్రమే అవుతుంది. అనివార్యంగా జగన్ అరెస్టు జరుగుతుందని చెప్పలేని సందర్భమే ఉంది. అయితే, జాతీయ మీడియా కొంత మేరకు, స్థానిక మీడియా కొంత మేరకు అటువంటి వార్తాకథనాలు రాయడానికి వెనకాడడం లేదు.












Click it and Unblock the Notifications