జగన్ పని తెలంగాణ చేస్తుందా?

తెలంగాణ కోసం తాము రాజీనామాలు చేస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు పలుమార్లు చెప్పారు. అందుకు అనుగుణంగా వారు నిర్ణయం తీసుకుంటానే వార్తలు బలంగా వస్తున్నాయి. పార్లమెంటు సభ్యులు కాకుండా శాసనసభ్యులు రాజీనామాలకు సిద్ధపడ్తారనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తిరం పాలు చేయడం ద్వారా కాంగ్రెసు అధిష్టానానికి హెచ్చరికలు పంపాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులపై ఆందోళనకారుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అంత మంది కాకున్నా కొద్ది మందైనా రాజీనామాలకు ముందుకు వస్తారని అంటున్నారు. కొద్ది మంది రాజీనామాలకు సిద్ధపడిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు తమ కార్యాన్ని నెరవేర్చుకోవడానికి ముందుకు రావచ్చునని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు కూడా వారికి సహకరించవచ్చు.
మధ్యంతర ఎన్నికలు తేవాలనే జగన్ లక్ష్యం తెలంగాణ ఉద్యమం వల్ల సాకారమవుతుందని అంటున్నారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కూడా ఇప్పుడు మధ్యంతర ఎన్నికలనే కోరుకుంటున్నారు. మధ్యంతర ఎన్నికల ద్వారా తెలంగాణ సత్తా చాటాలని ఆయన అనుకుంటున్నారు. అందువల్ల కొద్ది రోజుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అస్థిరపాలు కావచ్చునని అంటున్నారు. ఇదే పరిస్థితి వస్తే కేంద్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కూడా లేకపోలేదనే మాట వినిపిస్తోంది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. సోనియాతో ఆయన 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ఆయన సోనియాకు వివరించినట్లు తెలుస్తోంది. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి గడ్డు కాలమే.












Click it and Unblock the Notifications