చంద్రబాబు లిక్కర్ మిషన్: బొత్సపై ప్రత్యేక గురి

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం తెలుగదేశం సభ్యుడు విఆర్‌కె బాబు పేరు మద్యం సిండికేట్ల రిమాండ్ రిపోర్టులో చోటు చేసుకుంది. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితే. అయితే తమ పార్టీకి చెందినవారు మద్యం సిండికేట్లలో ఉన్నట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెబుతున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మద్యం సిండికేట్ల వివరాలను చంద్రబాబు సేకరిస్తున్నారు. హైదరాబాదు, రంగారెడ్డి, ఇతర జిల్లాల సమాచారం కూడా సేకరిస్తున్నారు.
కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు లిక్కర్ సిండికేట్లతో ఉన్న సంబంధాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం లిక్కర్ సిండికేట్లలో బొత్స సత్యనారాయణ పాత్ర ఉన్నట్లు ఆయన అనుమానిస్తున్నారు. దీంతో ఈ జిల్లాల మద్యం సిండికేట్లపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. లిక్కర్ సిండికేట్లలో పాత్ర ఉన్న మంత్రులపై కూడా ఆయన గురి పెట్టినట్లు చెబుతున్నారు. మంత్రుల పాత్రను, బొత్స పాత్రను ఆధారాలతో సహా బయట పెట్టగలిగితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేయవచ్చునని ఆయన అనుకుంటున్నారు.