లోకసత్తా జెపి వ్యాఖ్యలతో చిక్కుల్లో ఐఎఎస్‍లు

మంత్రి వర్గం తీసుకునే నిర్ణయాలను అమలు చేసేవారమే తప్ప తమకు ఏ పాత్రా ఉండదని బుకాయించడానికి చేస్తున్న ఐఎఎస్ అధికారుల మాటలకు జెపి వ్యాఖ్యలు విరుగుడుగా పనిచేస్తున్నాయి. ఐఏఎస్‌లు నీతిగా ఉంటే రాజకీయ అవినీతిని అంతమొందించవచ్చని ఆయన చెప్పారు. నాయకులు చెప్పినట్లు చేస్తున్నామని ఐఏఎస్‌లు చెప్పటం ముమ్మాటికీ తప్పేనని ఎమ్మార్ కుంభకోణంపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాల పాపాలను రాజకీయ నాయకుల మీదికి నెట్టడానికి ఐఎఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారనేది వారి మాటలను బట్టి స్పష్టంగానే అర్థమవుతోంది. జయప్రకాష్ నారాయణ అవినీతికి అండ కాస్తున్న ఐఎఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా అన్నారు. అసలు అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, వారి పదవిని ఊడపీకడంతో పాటు దాని ద్వారా సంపాదించిన ఆస్తిని ప్రభుత్వపరం చేసి జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఐఎఎస్ అధికారులు నీతిపరులైతే రాజకీయ నాయకుల అవినీతిని అడ్డుకోవడానికి కూడా వీలవుతుందని ఆయన చెబుతున్నారు. అయితే, విధానపరమైన నిర్ణయాల అమలులో భాగంగా ఎక్కడైనా తప్పు జరిగితే వారిని అవినీతిపరుల జాబితాలో చేర్చకూడదన్నారు. ఐఏఎస్‌లలో కూడా నిజాయితీపరులు ఉన్నారన్నారు. టెలికం శాఖలో ఉన్నతాధికారిగా పని చేసిన ఒక ఐఏఎస్ 2జీ స్పెక్ట్రమ్ వేలం వ్యవహారాన్ని అడ్డుకున్నారని, ఆయన రిటైరయ్యాకే రాజా ఇలా చేశారని చెప్పారు. ఐఎఎస్ అధికారుల అధికారాలు, పరిధి గురించి బాగా తెలిసిన జయప్రకాష్ నారాయణ ప్రస్తుత ఐఎఎస్ అధికారుల వాదనలను కొట్టిపారేయడం వల్ల సిబిఐ విచారణకు సామంజస్యం చేకూరుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications