తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రెండు నియోజకవర్గాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని అంటున్నారు. ఈ నెల 18వ తేదిన తెలంగాణలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలలో నాగర్ కర్నూల్‌లో తెరాస తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డికి మద్దతిస్తోంది. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఐదు స్థానాలు తమవేనని చెబుతున్నప్పటికీ రెండు నియోజకవర్గాలు మాత్రం టిఆర్ఎస్ నేతలను, ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ను టెన్షన్‌కు గురి చేస్తున్నాయట. అందులో మొదటిది మహబూబ్ నగర్. అక్కడ తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ బరిలో నిలిచింది. దీంతో ఓట్లు భారీగా చీలే అవకాశాలు ఉన్నాయని, అది తమ అభ్యర్థి విజయానికి గండి కొడుతుందేమోనని టెన్షన్ పడుతున్నారట. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రెండు రోజుల క్రితం మిగిలిన నాలుగు స్థానాల్లో టిఆర్ఎస్‌ను గెలిపించినప్పటికీ మహబూబ్ నగర్‌లో మాత్రం బిజెపిని గెలిపించాలని, అలా చేస్తే తెలంగాణవాదం జాతీయస్థాయిలో మరింత చెలరేగి కాంగ్రెసులో వణుకు పుట్టిస్తుందని అన్నారు.
అంతేకాదు జూపల్లి కృష్ణారావు రాకతో స్థానిక పార్టీ ముఖ్య నేత ఒకరు జిల్లాలో కాంగ్రెసుకు దగ్గరయ్యారు. ముఖ్యనేత దూరమవడం, ప్రధానంగా తెలంగాణవాదం జాతీయస్థాయిలో గట్టిగా వినిపిస్తున్న బిజెపి బరిలోకి దిగడం తమకు నష్టం కలిగిస్తుందని వారు మదన పడుతున్నారట. ఇక వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ టిఆర్ఎస్‌కు టెన్షన్ పెడుతున్న మరో నియోజకవర్గం అని అంటున్నారు. అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజయ్యపై స్థానికంగా చాలా వ్యతిరేకత ఉందని అంటున్నారు. అదే సమయంలో రాజయ్య కంటే టిడిపి సీనియర్ నేత కడియం శ్రీహరి చాలా బెటర్ అని ప్రజలు భావిస్తున్నారట. రాజయ్య టిఆర్ఎస్‌లోకి వెళ్లినప్పటికీ స్థానిక కాంగ్రెసు క్యాడర్ పెద్దగా ఆయన వెంట రాలేదని అంటున్నారు. ఇవన్నీ బేరీజు వేసిన రాజకీయ పరిశీలకులు కొద్దిగా కష్టపడితే అక్కడ టిడిపి గెలుస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ సీనియర్లు పలువురు అక్కడే మకాం వేసి రాజయ్య గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయినప్పటికీ అక్కడ గెలుస్తామా? గెలిచినా మెజార్టీ భారీగా వస్తుందా? అని టిఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ కనిపిస్తోందంట. కెసిఆర్ పార్లమెంటు స్థానం అయిన మహబూబ్‌నగర్, తెలంగాణవాదానికి ఉద్యమ కోట అయిన వరంగల్ జిల్లా నియోజకవర్గమే టిఆర్ఎస్‌కు ముచ్చెమటలు పట్టించడం విశేషం.