వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్Xకెసిఆర్: ఎవరి కాళ్లకింద భూమి కదుల్తోంది?

By Srinivas
|
Google Oneindia TeluguNews

 K Chandrasekhar Rao - YS Jagan
తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇటీవల ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలోకి ప్రవేశించదని భావించిన జగన్ పార్టీ చాపకింద నీరులా వస్తుండటం జీర్ణించుకోలేని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీని కూడా సమర్థవంతంగా ఢీకొనేందుకు సిద్ధపడ్డారు. జగన్ పార్టీ తెలంగాణ వైపు చూస్తుందని తెలిసినప్పటి నుండి కెసిఆర్ తన వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించారు.

తమను చూసి భయపడుతున్నాయని ఇరు పార్టీలు పరస్పరం వాదించుకుంటున్నాయి. అయితే జగన్ ఎంట్రీతో కెసిఆర్‌‍లోనే అంతర్మథనం ప్రారంభమైందని అంటున్నారు. మూడేళ్లుగా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉంటోంది. ఇలాంటి సమయంలో అధికార కాంగ్రెసు పార్టీని, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని కెసిఆర్ మూడు చెరువుల నీళ్లు తాగించారనే చెప్పవచ్చు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని పక్షంలో టిడిపి, కాంగ్రెసు నేతలను సొంత నియోజకవర్గాలలో తిరగనీయని పరిస్థితి మొన్నటి వరకు కనిపించింది.

అయితే టిడిపి, కాంగ్రెసులకు మూడు చెరువుల నీళ్లు తాగించిన కెసిఆర్‌ను ఇప్పుడు జగన్ పార్టీ అంతకంటే ఎక్కువగా వణికిస్తుందని అంటున్నారు. సీమాంధ్రలో తన బలం నిరూపించుకున్న జగన్ గత కొన్నాళ్లుగా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన ఆయా జిల్లాల్లో బలమైన నేతలను తన వైపుకు తెచ్చుకుంటున్నారు. సంకినేని వెంకటేశ్వర రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి వంటి బలమైన నేతలను జగన్ ఆకర్షిస్తున్నాడు.

ఇది తనకు ఎక్కడ ముప్పు తెస్తుందో అనే ఆందోళనతో కెసిఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఎదురుదాడికి సిద్ధమయ్యారని అంటున్నారు. అంతకుముందు జగన్ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే విమర్శలు ఎదుర్కొన్న కెసిఆర్ ఇప్పుడు అతన్నే తెలంగాణలో తన ప్రధాన టార్గెట్‌గా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో జగన్ బలం, బలగం క్రమంగా పెరుగుతోంది. జగన్ వ్యూహాత్మకంగా ఆయా జిల్లాల్లో బలం ఉన్న నేతలను ప్రధానంగా ఆకర్షిస్తున్నారని అంటున్నారు.

పదేళ్లుగా 'తెలంగాణ' పేటెంట్‌గా ఉన్న కెసిఆర్ ఇటీవల బిజెపి, సిపిఐ వంటి పార్టీల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వీరు ఎవరికి వారు పోటీ చేస్తే తెలంగాణవాదుల ఓట్లు చీలిపోతాయి. మరోవైపు జగన్ పార్టీ క్రమంగా తెలంగాణలో బలం పెంచుకుంటోంది. ఇంకోవైపు 2014 ఎన్నికల్లో 70కి పైగా అసెంబ్లీ సీట్లు, 12కు పైగా పార్లమెంటు సీట్లు గెలుపొందాలనే భావనతో కెసిఆర్ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓట్ల చీలిక, జగన్ బలం తెరాస భవిష్యత్తుకు ఎక్కడ ముప్పు తెస్తుందో అన్న ఆందోళన కెసిఆర్‌లో కనిపిస్తోందని అంటున్నారు.

అందుకే సిరిసిల్ల విజయమ్మ చేనేత దీక్ష యాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, తెలంగాణ జిల్లాల్లో వరుసగా బహిరంగ సభలు పెడుతున్నారని, బాబుతో పాటు జగన్‌ను ప్రతి సభలోను విమర్శిస్తున్నారని అంటున్నారు. తన కాళ్ల కింద భూమి క్రమంగా కదులుతోందనే భయంతో కెసిఆర్ వైయస్సార్ కాంగ్రెసును లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు. జగన్ కారణంగా ప్రస్తుతం కెసిఆర్ బలం పెంచుకోవడమేమో కానీ పట్టు నిలుపుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు జగన్ మాత్రం క్రమంగా తన బలం పెంచుకునే వ్యూహాలు రచిస్తున్నారు.

English summary
TRS chief K Chandrasekhar Rao has targetted YSR Congress party from two three month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X