టి ప్రభుత్వంపై బెట్టింగ్: కెసిఆర్ విన్, మల్కాజిగిరిపైనా
తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు పైన జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. తెరాస 65 సీట్ల వరకు గెలుచుకుంటుందని పందెరాయుళ్లు భావిస్తున్నారట. అలా కాకపోయినా.. కొన్ని సీట్లు అటు ఇటు అయినా ఇతరుల సహకారంతో తెరాసనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పందెరాయుళ్లు భావిస్తున్నారట. తెలంగాణ తొలి ప్రభుత్వంపై బెట్టింగ్ జరగడం ఆసక్తికరంగా మారింది.
అలాగే తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పోటీ చేసిన జనగామ నియోజకవర్గం పైన పందేలు జరుగుతున్నాయి. పొన్నాల ఓడిపోతారని, తక్కువ మెజార్టీతోని గెలుపొందుతారని పందేలు కాస్తున్నారట. మానుకోట ఎంపీ స్థానం ఎవరిదనే ఆసక్తి సాధారణ జనంతో పాటు పోలీసుల్లోనూ అధికంగా ఉంది.

మెదక్ జిల్లా సిద్దిపేటలో హరీష్ రావు సాధించే మెజారిటీ, గజ్వేల్‌లో కెసిఆర్ గెలుపు, మెజార్టీ, మెదక్‌లో విజయశాంతి గెలుపోటములు.. నిజామాబాద్‌లో మధుయాష్కి, కవితల గెలుపోటములు, అందోల్‌లో దామోదర రాజనర్సింహ, బాబూమోహన్ గెలుపోటములపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.
ఖమ్మం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గెలుపు పైన, మెజార్టీ పైన భారీగా పందెం కాస్తున్నారు. సికింద్రాబాద్ బిజెపి అభ్యర్థి బండారు దత్తాత్రేయ ఈసారి గెలుస్తారని పందెం ఎక్కువ మందే కాస్తున్నారట. మోడీ వేవ్, తెలంగాణ సెంటిమెంట్ కారణంగా సికింద్రాబాద్ బిజెపి పరం కావొచ్చని భావిస్తున్నారట.
మల్కాజిగిరి లోకసభ స్థానం పైన పెద్ద మొత్తంలో బెట్టింగ్ కడుతున్నారట. ఇక్కడ అభ్యర్థులందరి మధ్య పోటా పోటీ ఉందట. జయప్రకాశ్ నారాయణ, టిడిపి అభ్యర్థి మల్లారెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి సర్వే సత్యనారాయణల మధ్య పోటా పోటీ ఉందట. తెరాస 65, కాంగ్రెసు 30 సీట్లు గెలుచుకుంటుందని బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications