అమరావతి: గండికోట 'రాజశిల', గిన్నిస్ రికార్డుల్లోకి
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందజేస్తున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ గండికోట రాజవంశీకుడు పెమ్మసాని ప్రభాకర నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడుకు 'రాజశిల'ను బహుకరించారు.
శంకుస్థాపన కార్యక్రమంలో ఈ రాజశిలను ఉపయోగించాలని పెమ్మసాని ప్రభాకర నాయుడు సీఎంకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపజిల్లా గండికోట రాజకోట నుంచి ఈ శిలను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. గండికోటను సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించే విధంగా కృషి చేయాలని చంద్రబాబును ఆయన కోరామన్నారు.
మైలవరం డ్యామ్, చంద్రగిరిలో ఉన్న ఈ కోటకు సంబంధించిన శిల్పాలు, వస్తువులను తెప్పించి గండికోటలో మ్యూజియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. నాటిరాజు పెమ్మసాని చిన్న తిమ్మానాయుడు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, కోటను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ప్రభాకరనాయుడు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు 'మై బ్రిక్ - మై అమరావతి'కి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. ఇక నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్టుల్లోకి ఎక్కించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 16 వేల గ్రామాల నుంచి మట్టి, దేశంలోని అన్ని నదులు, అన్ని మతాల దేవాలయాలు, మహనీయుల ఇళ్ల నుంచి నీరు, మట్టి సేకరించి అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచంలోనే ఇటువంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి. దీంతో అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్‌లోకి స్ధానం పొందే అవకాశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమీక్షించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరగాలని మంత్రులకు, అధికారులకు ఆదేశించారు.
ప్రార్థనలు, పూజలు, మంత్రాలతో శంకుస్థాపన ప్రాంగణం మారుమోగాలని సూచించారు. మొత్తం 16 టన్నుల మట్టిని సేకరిస్తున్నందున, దీనిలో కొంత సీఆర్డీయే పరిధిలో జల్లాలని ఆయన ఆదేశించారు. మిగతా మట్టి, నీటిని రాజధాని ప్రాంతంలో జరిగే ప్రతి నిర్మాణంలోనూ కలపాలని ఆదేశించారు. శంకుస్థాపన శిలాఫలకం వందేళ్లు నిలిచేలా సహజ సిద్ధమైన బండరాయిపై చెక్కించాలని కూడా ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications