'కేసీఆర్‌కు ఆ పిచ్చి, చంద్రబాబుకు ఈ పిచ్చి'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల పైన సీపీఐ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వారి తీరు పట్ల సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్‌కు వాస్తు పిచ్చి, చంద్రబాబుకు యోగా పిచ్చి పట్టుకుందని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యల నుండి పక్కన పెట్టి వారు వాస్తు, యోగా అంటూ కథలు అల్లుతున్నారని అభిప్రాయపడ్డారు. సమస్యల నుండి ప్రజలను అదమరిపించేందుకే వారు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ తన సొంతింటిని నిర్మించుకోవడానికి వాస్తు చూసుకోవచ్చునని, వాస్తు బాగా లేదని సచివాలయాన్ని మరోచోట నిర్మిస్తానని చెప్పడమేమిటని మండిపడ్డారు. ఆసుపత్రిని తరలించి, సచివాలయం నిర్మించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇక చంద్రబాబు యోగా పేరుతో మూడు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పాలనను స్తంభింపచేశారన్నారు. యోగా వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంచుకునే అంశమని, ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకే ఇలా అన్నారు. వాస్తు పేరుతో రాజధానిని మూలకు తరలిస్తున్నారని, మంచి పంటలు పండే పొలాలు సేకరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కాగా, రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడుతూ... ప్రస్తుత సచివాలయం వాస్తు బాగా లేదని, అందుకే కొత్త సచివాలయం నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే చంద్రబాబు ప్రజాప్రతినిధులకు యోగా క్లాసులను ఇప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications