నాటి జగన్ పరిస్థితి: సీమాంధ్రలో టిడిపి హౌస్‌ఫుల్

బేషరతుగా చేరితే స్వాగతిస్తామని వారికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తామని, కాని సీటు కావాలంటే మాత్రం ఇవ్వలేమని చెబుతున్నారు. గతంలో టిడిపిలోకి వద్దామనుకొని... జాప్యం చేసిన వారు ఇప్పుడు పార్టీలోకి వచ్చినా సీటుపై హామీ ఇవ్వలేమంటున్నారట. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. టిడిపిలోకి రావాలని ఆయన బాగా ఆలస్యంగా అనుకొన్నారు.
కానీ ఇప్పుడు ఆయనకు ఆ జిల్లాలో సీటు దొరకడం కష్టంగా ఉందట. ఆయన తరపున విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు శనివారం ఇక్కడ చంద్రబాబును కలిసి మాట్లాడినట్లు సమాచారం. పితాని కోరుతున్న ఆచంట సీట్లో స్వయంగా ఆయన బావే టిడిపి ఇన్‌చార్జిగా ఉన్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాత్రం కొంత సౌఖ్యంగా ఉన్నారు. ఆయన ఆరు నెలల క్రితమే చంద్రబాబుతో మాట్లాడినట్లు వినికిడి. తన విషయం రాయపాటి సాంబశివ రావుతో ముడిపడి ఉందని, ఆయన వస్తే తాను వస్తానని అప్పుడు డొక్కా చెప్పారు. ఆయనను ఆ జిల్లాలో సర్దుబాటు చేయగలమన్న అభిప్రాయంలో టిడిపి నేతలు ఉన్నారు.
కాంగ్రెస్ మాజీ మంత్రి తోట నరసింహం శుక్రవారం టిడిపిలో చేరారు. ఆయనకు ప్రస్తుత సిటింగ్ సీటు జగ్గంపేట ఇవ్వనున్నారని ప్రచారం జరగడంతో ఆ నియోజకవర్గంలోని టిడిపి శ్రేణులన్నీ తిరుగుబాటు చేశాయి. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డాయి. ఆయనకు అసెంబ్లీ సీటు ఇవ్వడం లేదని ఎంపీ సీటు ఇస్తున్నామని ముఖ్య నేతలు చెప్పిన తర్వాత కానీ అక్కడ ప్రశాంతత నెలకొనలేదు. ఆ నియోజకవర్గ పార్టీ నేతలను శనివారం ఇక్కడకు పిలిపించి మాట్లాడారు.
కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు విషయం కూడా టిడిపికి సంకటంగా మారింది. ఆయన టిడిపిలోకి రావడానికి ఆసక్తి చూపించినా స్థానికంగా పార్టీ శ్రేణులు అంగీకరించలేదు. దీంతో టిడిపి వెనకడుగు వేసింది. కావూరిని టిడిపిలోకి తీసుకొని ఏలూరు ఎంపీ సీటు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ నేత మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం చంద్రబాబును కలిసి మాట్లాడారు.
కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న నేతల విషయంలో ఆచితూచి వెళ్లాలన్న సూచనలు పార్టీ నేతల నుంచి అధిష్ఠానానికి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి టిడిపిని బలోపేతం చేయడం కోసమే వస్తున్నవారిని తీసుకొంటున్నామని, అలా వస్తున్న వారందరికీ టికెట్ల హామీ లేదని టిడిపి నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications