రూట్ మార్చిన రేవంత్! : 'ఉస్మానియా అడ్డాగా...'
హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ చాలావరకు గల్లంతయ్యిన పరిస్థితి. పార్టీ బాధ్యతలను భుజానేసుకుని రేవంత్ రెడ్డి ఒక్కడే తిరిగి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పునర్వైభవం తీసుకురావడమన్నది అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. అందుకే ఇప్పటిదాకా అనుసరించిన పంథాకు భిన్నంగా రేవంత్ తన పొలిటికల్ రూట్ ని మార్చుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే రేవంత్ చూపు ఇప్పుడు క్యాంపస్ రాజకీయాల వైపుకు మళ్లుతోందా..! అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవడానికి విద్యార్థులే టార్గెట్ గా రేవంత్ పావులు కదుపుతున్నారేమోనన్న చర్చ ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది.
ఇందుకు తగ్గట్టుగా రేవంత్ తాజా వ్యవహార శైలి కూడా ఓయూని ఫోకస్ చేస్తూ భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నట్టుగానే సాగుతోంది. అందుకే హైకోర్టు అనుమతి నిరాకరించినా..! ఉస్మానియా జనజాతరకు రేవంత్ హాజరవడం వెనుక కూడా కారణం ఇదేనేమో..!

35 ప్రజాసంఘాలు కలిసి ఉస్మానియా జనజాతరను ఏర్పాటు చేసినా..! తెరవెనుక దాని ఏర్పాటుకు పూర్తి సహాయ సహకారాలు అందించింది మాత్రం రేవంతే అన్న వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన ఉస్మానియా ప్రాంగణానికి చాలా శక్తివంతమైన చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి ఏ సంకేతాలు జనంలోకి వెళ్తే, ఆ తరహా అభిప్రాయం జనంలో నాటుకుపోతుందన్న అభిప్రాయం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఉస్మానియాలోను, అక్కడి విద్యార్థుల్లోను తనకు అనుకూల పరిస్థితులను ఏర్పరుచుకోవాలని భావిస్తున్న రేవంత్, ఇందుకోసం ప్రజాసంఘాలను తనకు సానుకూలంగా మలుచుకుని తద్వారా ఉస్మానియా వేదిక నుంచి తన రాజకీయ ఇమేజ్ ను మార్చుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రేవంత్ కొత్త రాజకీయాలు తనకు ఎంతమేర లాభిస్తాయి, భవిష్యత్తు రాజకీయాలు రేవంత్ కి తెలంగాణలో ఎలాంటి స్థానం కట్టుబెడుతాయన్న దానిపై రాబోయే ఎన్నికల నాటికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పటిదాకా తెలంగాణ రాజకీయాలను ఆసక్తిగా గమనించాల్సిందే.












Click it and Unblock the Notifications