మోడీ నిర్ణయంతో మార్పులు: మనం ఏం చేయాలి?
న్యూఢిల్లీ: నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు రూ. 500, 1000 నోట్లను వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజానీకం కొంత ఇబ్బందులకు గురవుతోంది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
మోడీ నిర్ణయంతో ఏం మార్పులు:
-నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి రూ. 500, 1000 నోట్లు రద్దయి పోయాయి. ఇకపై అవి చెల్లుబాటు కావు.
-ఇతర కరెన్సీ నోట్లు రూ. 100, 50, 20, 10 నోట్లు చలామణిలోనే ఉంటాయి.
-చెక్కులు, కార్డులు, డిమాండ్ డ్రాఫ్ట్స్ లాంటి సేవలు సాధారణంగానే కొనసాగుతాయి.
- నవంబర్ 9న దేశంలోని అన్ని ఏటీఎంలు పూర్తిగా మూసివేయబడతాయి. నవంబర్ 10న దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏటీఎంలు తెరచుకుంటాయి.
- ఏటీఎంలు పని చేయడం మొదలు పెట్టిన కొన్ని రోజుల వరకు రూ. 2000వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని రూ. 4వేలకు పెంచుతారు.
- నవంబర్ 9 బ్యాంకులన్నీ మూసే ఉంటాయి.
- నవంబర్ 10 నుంచి 500, 1000 రూపాయల కొత్త నోట్లు అమలులోకి రానున్నాయి.

నోట్లను ఎలా మార్చుకోవాలి?
- రూ. 500, 1000 నోట్లను పోస్టాఫీసులు, బ్యాంకులలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు మార్చుకోవచ్చు.
- ఈ సందర్భంగా ఏదైనా గుర్తింపు కార్డు.. పాస్‌పోర్ట్, ప్యాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది.
- డిసెంబర్ 30లోపు నోట్లను మార్చుకోలేకపోతే.. మార్చి 31లోపు ఆ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది.
- నోట్లను మార్చుకోవడంలో కూడా పరిమితి ఉంది. రోజుకు రూ. 10,000 లేదా వారంలో రూ. 20,000 వరకు మాత్రమే మార్చుకోవచ్చు.
- పర్యాటకులు కూడా ఈ నోట్లను విమానాశ్రయాల్లో మార్చుకోవచ్చు.
మినహాయింపులు ఏమిటి?
నవంబర్ 11న అర్ధరాత్రి వరకు కూడా రూ. 500, 1000 నోట్లు కొన్ని లొకేషన్లలో చెల్లుబాటు అవుతాయి. అవేమిటంటే..
- ఆస్పత్రులు
- ప్రభుత్వ ఫార్మసీస్
- గవర్నమెంట్ బస్టాండ్లు, రైల్వే టికెట్ కౌంటర్స్
- విమానాశ్రయాలు
- స్మశాన వాటిక, పూడ్చి పెట్టిన ప్రదేశములు
- పాల కేంద్రాలు
- ప్రభుత్వం నడిపే వినియోగదారుల కో-ఆపరేటివ్ స్టోర్స్
- పెట్రోల్, డీజిల్, సీఎన్జీ స్టేషన్లు












Click it and Unblock the Notifications