Telangana tourism: భద్రాద్రి రాముడి దర్శనం-పాపికొండల్లో విహారం: కొత్త ప్యాకేజ్: పూర్తి వివరాలివే!
అమరావతి: అందమైన పాపికొండల మధ్య బోటు ప్రయాణం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుంది. చుట్టూ ఎత్తయిన పర్వతాలు, మధ్యలో పరవళ్లు తొక్కే గోదారిపై బోటులో షికారు చేయడం..జీవితాంతం గుర్తుండిపోయేలా తీపి జ్ఞాపకాలను మిగిలిస్తుంది. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతో నిండిన పాపికొండల మధ్య బోటు ప్రయాణం చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు పర్యాటకులు. డిసెంబర్ చలిలో, చేతికి అందేంత ఎత్తులో తిరుగాడే మేఘాలు, పొగమంచు మధ్య విహరించడం.. నిజంగా ఓ అద్భుతం. దీనికి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ దర్శనం కూడా తోడైంది.

తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ
కొంతకాలంగా భక్తులు, పర్యాటకుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పర్యాటక కార్పొరేషన్ అధికారులు కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టారు. భద్రాచలం-పాపికొండల ప్యాకేజీని ఇంట్రడ్యూస్ చేశారు. మూడు రోజుల ప్యాకేజీ ఇది. మూడు రాత్రులు- రెండు పగళ్లు ఉంటుంది. రోడ్ కమ్ రివర్ ప్యాకేజీ. తెలంగాణ పర్యాటక శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కరోనా వైరస్ ప్రొటోకాల్స్‌ను పర్యాటకులకు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

పికప్ పాయింట్లు ఇవే..
పర్యాటక బస్సు తొలి రోజు సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్ యాత్రీనివాస్ వద్ద బయలుదేరుతుంది. బేగంపేట్, గ్రీన్‌ల్యాండ్స్ వద్ద గల పర్యాటక భవన్, బషీర్‌బాగ్‌లోని చీఫ్ రిజర్వేషన్ కార్యాలయం పికప్ పాయింట్లుగా నిర్ధారించారు. 7:30 గంటలకు పర్యాటక భవన్, 8 గంటలకు బషీర్‌బాగ్ చీఫ్ రిజర్వేషన్ కార్యాలయానికి చేరుకుంటుంది. ఇదే చివరి పికప్ పాయింట్. మరెక్కడా స్టాపింగ్ ఉండదు. చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్ మీదుగా మరుసటి రోజు తెల్లవారు జామున 5 గంటలకు భద్రాచలానికి చేరుకుంటుందీ బస్సు. పర్యాటక సంస్థకు చెందిన హరిత హోటల్‌లో బసను ఏర్పాటు చేశారు అధికారులు.

పోచారం బోటింగ్ పాయింట్..
ఉదయం 7:30 గంటలకు ఈ బస్సు పోచారం బోటింగ్ పాయింట్‌కు బయలుదేరుతుంది. ఉదయం 10 గంటలకు బోటింగ్ ఆరంభమౌతుంది. పాపికొండల మీదుగా సాయంత్రం 4 గంటలకు పేరంటాల పల్లికి చేరుకుంటుంది క్రూయిజ్. గంట విరామం తరువాత మళ్లీ భద్రాచలానికి మళ్లుతుంది. పోచారం బోటింగ్ పాయింట్‌కు తిరిగి వస్తుంది. సాయంత్రం 7 గంటలకు భద్రాచలానికి చేరుకోవాల్సి ఉంటుంది. హరిత భద్రాచలం హోటల్‌లో రాత్రి బస చేయాల్సి ఉంటుంది.

భధ్రాద్రి రాముడి దర్శనం..
మూడో రోజు ఉదయం 7 గంటలకు భద్రాలచం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం ఉంటుంది. 9 గంటలకు బయలుదేరి 10:30 గంటలకు పర్ణశాలకు చేరుకుంటుంది బస్సు. 11:30 గంటలకు అక్కడి నుంచి తిరుగుముఖం పడుతుంది. 2:30 గంటలకు భద్రాచల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమౌతుంది. రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

ప్యాకేజీ టారిఫ్..
పెద్దలకు 4,999, పిల్లలలకు రూ.3,999ల టారిఫ్‌ను నిర్ధారించారు అధికారులు. నాన్ ఏసీ రవాణా, నాన్ ఏసీ వసతి, బోటింగ్, భోజన సౌకర్యాన్ని ఇందులోనే వసూలు చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా యాత్రీనివాస్, సీఆర్ఓల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల నుంచి టికెట్లను తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications