TVK నుంచి రోజా పోటీ?- రియాక్షన్ ఇదే
టీవీకే అధినేత విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆమె, తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న ఈ అనూహ్య మార్పులను విశ్లేషించడమే కాకుండా, తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు కూడా తెరదించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన అఖండ విజయంపై సినీ నటి, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఈ విజయాన్ని ఆమె ఒక 'అద్భుతం'గా అభివర్ణించారు. సాధారణంగా సినీ రంగంలో ఉన్నత స్థితిలో ఉండి, రాజకీయాల్లోకి రావడం ఒకెత్తయితే.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే రాజకీయాల కోసం సినిమాలను వదులుకోవడం గొప్ప విషయమని ఆమె కొనియాడారు. గతంలో ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి వారు ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ ఇంత చిన్న వయసులో, ఎవరి మద్దతు లేకుండా సింగిల్ పార్టీగా వచ్చి విజయ్ చరిత్ర సృష్టించడం అసాధారణమని ఆమె ప్రశంసించారు.

క్లాస్ ఓటింగ్‌తోనే ఈ మార్పు సాధ్యమైంది..
ఎన్నికల ఫలితాల సరళిపై రోజా విశ్లేషిస్తూ.. ఓటర్లు చాలా సైలెంట్‌గా ఉండి పెద్ద తీర్పునిచ్చారని పేర్కొన్నారు. "విజయ్‌కు కేవలం మాస్ ఫాలోయింగ్ మాత్రమే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ నా స్నేహితులైన డాక్టర్లు, లాయర్లు, విద్యావంతులు కూడా మార్పు కోరుకుంటూ విజయ్‌కే ఓటు వేశామని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. క్లాస్ ఓటింగ్ కూడా టీవీకే వైపు మళ్లిందంటే ఇక అక్కడ తిరుగులేదని అర్థమైంది. అన్నాడీఎంకే ఓట్లు మాత్రమే చీలుతాయని అందరూ భావించారు, కానీ అనూహ్యంగా డీఎంకే ఓట్లు కూడా చీల్చి విజయ్ ప్రభంజనం సృష్టించారు" అని రోజా తెలిపారు.
తమిళనాడు కోడలిగా ఆహ్వానాలు అందాయి కానీ..
తమిళనాడులో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. జయలలిత బతికున్న సమయంలోనే తనను తమిళనాడు నుంచి పోటీ చేయాలని కోరినట్లు రోజా వెల్లడించారు. తాను తమిళనాడు కోడలిని కాబట్టి, ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు రావడం సహజమని ఆమె అన్నారు. అదే విధంగా టీవీకే నుంచి కూడా ఆహ్వానం వచ్చినట్లు తెలిపారు. అయితే, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తనకున్న బంధం విడదీయలేనిదని ఆమె స్పష్టం చేశారు. జగన్ తనను సొంత చెల్లిలా చూసుకుంటారని, తనపై నమ్మకంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
జగనన్నను వదిలే ప్రసక్తే లేదు!
తన రాజకీయ ప్రయాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందని రోజా నొక్కి చెప్పారు. "ఈరోజు నేను దేశంలో ఎక్కడికి వెళ్లినా నాకు లభిస్తున్న గౌరవానికి కారణం జగన్ గారే. అటువంటి వ్యక్తిని వదిలి వెళ్లే పరిస్థితి నాకు లేదు" అని ఆమె తేల్చి చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ అభిమానులంతా ఆల్మోస్ట్ విజయ్‌కే సపోర్ట్ చేశారని ఆమె ఈ సందర్భంగా వెల్లడించడం గమనార్హం. కేవలం రాజకీయాలకే కాకుండా, ప్రజలకు సేవ చేయాలనే విజయ్ సంకల్పానికి ప్రజలు పట్టం కట్టారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications