నా కొడుకే సీఎం-మద్దతివ్వండి..! ఆ పార్టీని కోరిన విజయ్ తండ్రి..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కొత్త పార్టీ టీవీకే అనూహ్య విజయాలు సాధిస్తోంది. కాకలు తిరిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్ని కాదని ఓటర్లు విజయ్ పార్టీకి మద్దతివ్వడంతో టీవీకే ఏకంగా 100కు పైగా సీట్లు సాధిస్తోంది. అయితే తమిళనాడు అసెంబ్లీలో అధికారం చేప్టటాలంటే మెజార్టీకి కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ మార్కును మాత్రం అందుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ (SA chandrasekhar) కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ ఇవాళ వెలువడుతున్న తమిళనాడు ఫలితాల నేపథ్యంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వంటి బలహీనపడిన పార్టీలు విజయ్ యొక్క తమిళగ వెట్రి కజగంతో పొత్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. అటువంటి భాగస్వామ్యం ద్వారా వారు కోల్పోయిన రాజకీయ అధికారాన్ని తిరిగి పొందగలరని ఆయన హామీ ఇచ్చారు. 234 స్థానాలకు గాను 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే ఘన విజయం నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్ ఇచ్చారు.

రాష్ట్రంలో డీఎంకే,అన్నాడీఎంకే వంటి సుస్థిర పార్టీలపై ప్రజాగ్రహాన్ని చంద్రశేఖర్ ప్రముఖంగా ప్రస్తావించారు. విజయ్ మంచి ఉద్దేశాలు, యువతను ఆకట్టుకునే గుణంతో టీవీకే ఒక సరికొత్త ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సినిమా రంగం నుండి నాయకత్వంలోకి విజయ్ అడుగుపెట్టడాన్ని ఆయన గుర్తుచేస్తూ..ఓటర్లు అతడిని ఒక మార్పు తెచ్చే వ్యక్తిగా ఆదరించారని తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా నిలవాలని చంద్రశేఖర్ కోరారు. గతంలోనూ కాంగ్రెస్ తో టీవీకే పొత్తు ఉంటుందని చంద్రశేఖర్ చెప్పినా.. అప్పట్లో కాంగ్రెస్ తిరస్కరించింది. ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి.














Click it and Unblock the Notifications