పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ.. ఈసీ షాకింగ్ ఆదేశాలు!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పట్ల దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న వేళ, కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు జరపరాదని కఠిన ఆంక్షలు విధించింది. ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ లో హింసను నివారించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల వేళ ఈసీ షాకింగ్ నిర్ణయం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ సీనియర్ అధికారి, ప్రత్యేక పరిశీలకులు సుబ్రతా గుప్తా తాజాగా ఈసీ విధించిన ఈ నిషేధాన్ని ధృవీకరించారు. అభ్యర్థులు గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా విజయ యాత్రలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. గెలిచిన అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి రోడ్లపైకి రాకూడదని ఆయన మీడియాకు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

దూకుడుగా బీజేపీ, కౌంటింగ్ లో పోరాటం చేస్తున్న టీఎంసీ
ఈసారి పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. నువ్వా నేనా అన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ తలపడ్డాయి. ఇక తాజాగా ఫలితాలు బీజేపీకి మెజార్టీ స్థానాలను కట్టబెడుతూ దూసుకుపోతున్నాయి. ఈ ఫలితాల సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా అదనపు బలగాలను మోహరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ సీనియర్ అధికారి, ప్రత్యేక పరిశీలకులు గుప్తా తెలిపారు.
రాజకీయ ఘర్షణలకు చాన్స్.. ఈసీకి ఫిర్యాదులు
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం రాజకీయ ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. మరోవైపు, కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యాక కొన్ని చోట్ల రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరలేకపోవడం, వారిని అడ్డుకోవడం వంటి ఆరోపణలపై సుబ్రతా గుప్తా స్పందించారు.
ఈసీ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ
ఈ సమస్య తమ దృష్టికి వచ్చింది. తక్షణమే పరిష్కరించి, ఏజెంట్లు తమ విధుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటాం అని ఆయన హామీ ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా వందలాది కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విజేత అభ్యర్థులు పరిమిత సంఖ్యలో వచ్చి ధ్రువీకరణ పత్రాలు స్వీకరించాలని, భారీగా జనాలతో రావద్దని ఆదేశాలున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. తాజా ఈసీ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













Click it and Unblock the Notifications