వరంగల్ వేదికగా రైతు సభల రాజకీయం.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్!
తెలంగాణ రాష్ట్రంలో రైతు ఓటు బ్యాంకు రాజకీయాలు ఊపందుకున్నాయి. రైతు అంశం పైన రసవత్తర రాజకీయం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా, 2022లో వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీఆర్ఎస్ తీవ్రంగా టార్గెట్ చేస్తోంది.
రైతు కేంద్రంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
అయితే కాంగ్రెస్ మాత్రం దీనికి కౌంటర్ గా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలు, రైతులకు అండగా ప్రభుత్వం ఉంటున్న తీరు, సాధించిన విజయాలను వివరిస్తూ మెగా రైతు మేళా కార్యక్రమంతో సమాధానం చెబుతోంది. ముఖ్యంగా వరంగల్ వేదికగా బి ఆర్ ఎస్ రైతు సంగ్రామ సదస్సును నిర్వహిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మెగా రైతు మేళాను నిర్వహిస్తోంది.

రైతు డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని బీఆర్ఎస్
గత ఎన్నికలకు ముందు మే ఆరవ తేదీన రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ను ప్రకటించారు. రైతు డిక్లరేషన్ లో రైతుల కోసం ఇచ్చిన హామీలను అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాకపోవడంతో వరంగల్ వేదికగా అదే మే ఆరవ తేదీన కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
విజయాలను వివరించాలని మెగా రైతు మేళా
ఈ క్రమంలో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సభలో కేటీఆర్ కూడా పాల్గొని అధికార కాంగ్రెస్ ను తూర్పారబట్టనున్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశామని, తమ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలను వివరిస్తూ హన్మకొండ వేదికగా 5, 6, 7 తేదీలలో మూడు రోజులపాటు కాంగ్రెస్ మెగా రైతు మేళాను నిర్వహిస్తోంది.
రైతు మేళాలో రైతులను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు
తాము రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ మెగా రైతు మేళాలో రైతులను భాగస్వాములను చేస్తూ ఆధునిక సాంకేతిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తారు. రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో చెబుతారు.
ఎన్నికల ఓటు బ్యాంకు రాజకీయం
అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు ఓటు బ్యాంకు కోసం రెండు పార్టీలు పోటాపోటీగా సభలు, మేళాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. వరంగల్ వేదికగా జరగనున్న రైతు సభల రాజకీయం ఏ పార్టీకి ప్లస్ అవుతుందో, ఎవరికి మైనస్ అవుతుందో త్వరలోనే తెలియనుంది.












Click it and Unblock the Notifications