ఈ జిల్లాలలో వర్షాలు.. వర్షాలపైనే కాదు, ఎండ తీవ్రతపైనా హెచ్చరిస్తున్న ఐఎండీ
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. వర్ష ప్రభావంతో భానుడి భగభగలు నుండి ఉపశమనం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. మే రెండవ వారంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి మే 11 లేదా 12 తేదీల నాటికి అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆ జిల్లాలలో వర్షాలకు ఛాన్స్
అయితే, మే 8వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరోసారి పెరుగుతాయని, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాలు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలలో కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినప్పటికీ, నిజామాబాద్‌లోని మెండోరాలో 45.4°C, జగిత్యాలలో 45.3°C గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అకాల వర్షాలతో రైతులకు ఇబ్బంది
ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా మామిడి పంట తీవ్రంగా దెబ్బతింటుంది. మరోవైపు రైతులు ధాన్యం, మొక్కజొన్నలు విక్రయించుకునే సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. మళ్లీ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చింది.
ఎండలతోనూ జాగ్రత్త
అయితే ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉన్నవేళ ఎండలపై అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హీట్‌స్ట్రోక్ ప్రాణాంతక అత్యవసర పరిస్థితి అని, వడదెబ్బ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సాధారణ జ్వరం వచ్చినప్పుడు శరీరం చెమట ద్వారా వేడిని నియంత్రిస్తుంది. కానీ, హీట్‌స్ట్రోక్‌లో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుంది.
వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి
ఎండలో ఉన్నా చెమట పట్టకపోవడం మెదడు, గుండె, మూత్రపిండాలను దెబ్బతీసే ప్రమాదకర సంకేతమని వైద్యులు చెబుతున్నారు. హీట్‌స్ట్రోక్‌కు గురైనప్పుడు తొలి ఐదు నిమిషాలు అత్యంత కీలకమని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.ఎండల నుంచి రక్షణ పొందడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఎండల నుండి కాపాడుకోటానికి ఇలా చెయ్యండి
దాహం వేయకున్నా రోజుకు 7-8 గ్లాసుల నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకి వెళ్లకపోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. వెళ్ళాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు, ముఖ్యంగా తెల్లటి కాటన్ దుస్తులు ధరించాలి. మద్యం, కెఫీన్ కలిగిన పానీయాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications