Perplexity AI: సోషల్ మీడియా బదులు ఈ స్కిల్స్ నేర్చుకోండి..! పర్ ప్లెక్సిటీ సీఈవో సలహా..!
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపకుండా ఏఐ టూల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాలని పర్ ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ యువతకు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావం పెరుగుతోంది. యువత ఏఐ స్కిల్స్ నేర్చుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే సోషల్ మీడియాను వదులుకునేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో భవిష్యత్తులో ఏఐ టూల్స్ ప్రభావం, సోషల్ మీడియాతో పోలుస్తూ ప్రముఖ ఏఐ ప్లాట్ ఫామ్ పర్ ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ యువతకు కీలక సలహా ఇచ్చారు. భవిష్యత్తులో ఉద్యోగాలు కావాలంటే ఏం చేయాలో ఆయన యూత్ కు సూచించారు.
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపకుండా ఏఐ టూల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాలని పర్ ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ యువతకు తెలిపారు. ఏఐ నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలను గణనీయంగా పెంచుతాయని ఆయన తెలిపారు. వేగంగా మారుతున్న ఏఐ సాంకేతికతకు అనుగుణంగా ఉండటం కష్టమని అంగీకరించిన శ్రీనివాస్.. ఇది ప్రతి మూడు నుండి ఆరు నెలలకు మారుతూ ఉంటుందని వివరించారు.

కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం స్క్రోల్ చేస్తూ సమయం వృథా చేయకుండా, ఏఐ టూల్స్ ఉపయోగించడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని యువతకు ఆయన సూచించారు. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోని వారు ఉద్యోగ మార్కెట్‌లో వెనుకబడిపోతారని శ్రీనివాస్ హెచ్చరించారు. ఏఐ సాధనాల్ని వాడటంలో ముందున్న వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువని ఆయన తెలిపారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఆయన వెల్లడించారు.
ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, చాలా మందికి దానిని అనుసరించడం కష్టంగా మారుతోందని పర్ ప్లక్సిటీ సీఈఓ తెలిపారు. మనుషులు వేగంగా మార్పుకు సిద్ధంగా ఉండరని, ఏఐ టెక్నాలజీ ప్రతి మూడు నుండి ఆరు నెలలకు మారుతోందని, మనం ఎంత వేగంగా దీనికి అలవాటు పడగలమో పరీక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఏఐ పురోగతికి అనుగుణంగా ఉండలేక కొంతమంది ఉద్యోగాలు కోల్పోతారన్నారు.
ఏఐ వల్ల పరిశ్రమలలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నందున, కొత్త ఉద్యోగ అవకాశాలు సాంప్రదాయ కంపెనీల నుండి కాకుండా వ్యవస్థాపకుల నుండి రావాలని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు సొంతంగా కంపెనీలను ప్రారంభించి ఏఐ పరిజ్ఞానాన్ని వాడుకోవాలని, లేదా ఏఐలను నేర్చుకుని కొత్త కంపెనీలకు సాయపడాలని సూచించారు.












Click it and Unblock the Notifications