మీ అవసరం మాకు లేదు- లేఆఫ్స్ ప్రకటించిన మస్క్
xAl Lays Offs: అపర కుబేరుడు, ఎలక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సైతం లేఆఫ్స్ బాట పట్టారు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఎక్స్ ఏఐలో భారీగా ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించారు. దీని ప్రభావం 500 మందికి పైగా ఉద్యోగులపై పడింది. వారందరూ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. లేఆఫ్స్ బారిన పడ్డ ఉద్యోగులందరూ డేటా ఇన్నవేషన్ విభాగానికి చెందిన వాళ్లే.
తొలగింపునకు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది కూడా. జనరలిస్ట్ ఏఐ ట్యూటర్లుగా ఎక్స్ ఏఐలో పనిచేశారు. గ్రోక్ కు ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వింగ్ ఇది. కంపెనీ భారీ పునఃవ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్టు చెబుతున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లను మాత్రమే నియమించుకోవాలని ఎక్స్ ఏఐ భావిస్తోన్నట్లు బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపింది.

తొలగింపునకు గల కారణాలను ఇ-మెయిల్స్ లో స్పష్టంగా వివరించింది ఎక్స్ ఏఐ యాజమాన్యం. హ్యూమన్ డేటా నిశితంగా సమీక్షించామని, సాధారణ ఏఐ ట్యూటర్ల కంటే కూడా స్పెషలిస్టలను నియమించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించామని వివరించింది. ఈ విభాగాన్ని మరింత విస్తరించడంతో పాటు పోటీ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలని తీసుకున్న నిర్ణయాల్లో ఇదొక భాగమని పేర్కొంది.
స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ వింగ్ ను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నామని, ఈ క్రమంలో సాధారణ AI ట్యూటర్లను తగ్గిస్తోన్నామని తెలిపింది. ఈ వ్యూహాత్మక మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పింది. తమకు సాధారణ AI ట్యూటర్ అవసరాలు చాలావరకు లేదని, ఈ మెయిల్ తోనే xAIలో ఉద్యోగం ముగుస్తుందని స్పష్టంగా పేర్కొంది. మెయిల్ అందుకున్న ఉద్యోగులకు కంపెనీ సిస్టమ్‌ల నుంచి యాక్సెస్ తక్షణమే నిలిపివేసింది.
ఈ 500 మంది ఉద్యోగుల కాంట్రాక్ట్ గడువు ముగిసే వరకు లేదా ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు జీతం యధాతథంగా అందుతుందని ఎక్స్ ఏఐ తెలిపింది. భవిష్యత్తులో స్పెషలిస్ట్ ఏఐ టీమ్ ను మాత్రం 10 రెట్లు పెంచుతామని, అలాంటి వారి సేవలను మరింత విస్తరిస్తామని పేర్కొంది. వీడియో గేమ్, వెబ్ డిజైన్, డేటా సైన్స్, మెడిసిన్, స్టెమ్ వంటి విభాగాల్లో స్పెషలిస్ట్ AI ట్యూటర్ల కోసం ఖాళీలు ఉన్నట్లు ఎక్స్ ఏఐ వెబ్ సైట్ చూపించింది.












Click it and Unblock the Notifications