ప్రశాంత్‌నీల్ చేస్తున్న సినిమాలను ఎప్పుడో చేసేసిన బాలయ్య
ప్రస్తుతం టాలీవుడ్ ఖండాతరాలను దాటి గ్లోబల్ స్థాయిలో దూసుకుపోతోంది. మన స్టార్ హీరోలు, దర్శకులు సరికొత్త ప్రయోగాలతో పాన్-ఇండియా, పాన్-వరల్డ్ మార్కెట్‌ను శాసిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి, టాలీవుడ్ స్టార్స్‌తో భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ శైలిపై సినిమా సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో డార్క్ థీమ్ విజువల్స్, బొగ్గు గనుల నేపథ్యంలో యాక్షన్‌ను సరికొత్తగా చూపించి ఆయన ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' సినిమాను కూడా ఇదే తరహా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. కాకపోతే ఇది డ్రగ్స్ కు సంబంధించిన కథ. అయితే, ఈ బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్, అక్కడి శ్రామికుల జీవితాల నేపథ్యంలో సినిమా తీయడం అనేది ప్రశాంత్ నీల్‌తోనే మొదలవలేదని, టాలీవుడ్‌లో దీనికి ముందే ఒక పెద్ద చరిత్ర ఉందంటూ నెటిజన్లు పాత జ్ఞాపకాలను తవ్వుతున్నారు.
బాలయ్య నిప్పురవ్వ..
యూత్ డైరెక్టర్లు ఇప్పుడు చూపిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ కోల్ మైన్స్ కాన్సెప్ట్‌ను.. నటసింహం నందమూరి బాలకృష్ణ 30 ఏళ్ల క్రితమే వెండితెరపై ఆవిష్కరించారు. 1993లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన 'నిప్పురవ్వ'లో బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల కష్టాలు, అక్కడ జరిగే అన్యాయాలను చూపించారు. అప్పట్లోనే ఈ సినిమాను చాలా సహజంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ డూప్ లేకుండా ప్రాణాలకు తెగించి అనేక సాహసోపేతమైన యాక్షన్ సీన్లలో నటించారు. నేటి తరం దర్శకులు వాడుతున్న ఆ డార్క్ అండ్ డస్టీ వాతావరణాన్ని, మైనింగ్ ఎలిమెంట్స్‌ను బాలయ్య అప్పట్లోనే సరికొత్తగా ప్రయోగించి చూపించారు.

కథనం చాలా భిన్నం..
అయితే, ఆ కాలపు ప్రేక్షకుల అభిరుచికి 'నిప్పురవ్వ' కథనం కాస్త భిన్నంగా ఉండటం వల్ల, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ ప్రయోగం విఫలం కావడంతో బాలయ్య ఆ తర్వాత కమర్షియల్, మాస్ ఫార్ములా సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ, కంటెంట్ పరంగా 'నిప్పురవ్వ' ఒక క్లాసిక్ ప్రయత్నమని సినీ విశ్లేషకులు ఇప్పటికీ అంటుంటారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ సినిమాల విజువల్స్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో.. "మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌ను మన బాలయ్య ఎప్పుడో టచ్ చేశారు" అంటూ ఆయన అభిమానులు 'నిప్పురవ్వ' వర్కింగ్ స్టిల్స్, వీడియో క్లిప్స్‌ను షేర్ చేస్తూ నెట్‌లో వైరల్ చేస్తున్నారు. ట్రెండ్‌ను ముందే పసిగట్టడంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటారని ఈ పాత సినిమాను గుర్తు చేసుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications