కృష్ణ.. ‘ఊ’ అనుంటే.. సగం హైదరాబాద్, సగం చెన్నై ఆయనవే అయ్యేవి!
సినీ పరిశ్రమలో 'డేరింగ్ అండ్ డాషింగ్' అనే పదానికి నిలువెత్తు రూపం సూపర్ స్టార్ కృష్ణ. కేవలం సాంకేతిక విప్లవాన్ని మాత్రమే కాదు, చిత్ర పరిశ్రమలో మానవత్వానికి సరికొత్త విలువలను నేర్పిన మహోన్నత వ్యక్తి ఆయన. తాజాగా ప్రముఖ నిర్మాత ముప్పా అంకమ్మ రావు ఒక ఇంటర్వ్యూలో కృష్ణ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కృష్ణ కేవలం డబ్బు సంపాదనపై దృష్టి పెట్టి ఉంటే.. ఈరోజు చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సగం ఆస్తులు ఆయనవే అయ్యేవని, ఈ తరం ఊహించలేనంత భారీ సామ్రాజ్యానికి మహేష్ బాబు వారసుడై ఉండేవరని ఆయన పేర్కొన్నారు.
శోభన్ బాబు రియల్ ఎస్టేట్.. కృష్ణ సినిమా బాట
ఆ రోజుల్లో 'సోగ్గాడు' శోభన్ బాబు తాను సంపాదించిన ప్రతి రూపాయిని దూరదృష్టితో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టారు. చెన్నైలో ఆయన కొనుగోలు చేసిన ఆస్తుల విలువ నేడు వేల కోట్లకు చేరింది. అయితే, కృష్ణ శోభన్ బాబు కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు సైతం సాధ్యం కాని రీతిలో 350కి పైగా సినిమాలు చేశారు. ఒకే ఏడాది 18 సినిమాలు చేసిన ఏకైక హీరో ఆయనే. ఆ పారితోషికాలన్నింటినీ ఆయన రియల్ ఎస్టేట్‌లో పెట్టి ఉంటే.. శోభన్ బాబుని మించి లక్షల కోట్ల ఆస్తులు ఆయన సొంతమయ్యేవి. కానీ, కృష్ణ మనసంతా ఎప్పుడూ సినిమా చుట్టూనే తిరిగేది.

ఇండస్ట్రీ నుంచి తీసుకుని.. మళ్లీ ఇండస్ట్రీకే ఇచ్చేసిన భోళా మనిషి
కృష్ణ నటుడిగా సంపాదించిన ప్రతి పైసాను మళ్లీ పద్మాలయా స్టూడియోస్ ద్వారా సినిమాలపైనే పెట్టుబడిగా పెట్టారు. ఆయనకు డబ్బు మీద కంటే తనను నమ్ముకున్న నిర్మాతలపైనే ఎక్కువ ప్రేమ ఉండేది. తనతో సినిమా తీసి నష్టపోయిన ఏ ఒక్క నిర్మాతను ఆయన రోడ్డున పడేయలేదు. సినిమా ప్లాప్ అయితే పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేయడం లేదా.. సదరు నిర్మాతకు రూపాయి తీసుకోకుండా ఉచితంగా తదుపరి సినిమా చేసి పెట్టడం కృష్ణకే చెల్లింది. సినిమా సెట్స్‌లో కార్మికులకు మొదటిసారి నాన్-వెజ్ భోజనం అందించే సాంప్రదాయాన్ని మొదలుపెట్టి ప్రొడక్షన్ విలువలనే మార్చేసిన ఘనత ఆయనది.
తెర వెనుక చేసిన 'అల్లూరి సీతారామరాజు' సాయం
కృష్ణ మంచి మనసుకు 'అల్లూరి సీతారామరాజు' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనే నిదర్శనం. ఆ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడికి తీవ్ర అనారోగ్యం చేసింది. దాంతో కృష్ణ స్వయంగా మెగాఫోన్ పట్టి చాలా భాగం డైరెక్ట్ చేశారు. కానీ, సినిమా పూర్తయ్యాక క్రెడిట్ మొత్తం సదరు దర్శకుడికే ఇచ్చేశారు కానీ, ఎక్కడా తన పేరు వేసుకోలేదు. డబ్బు కంటే తనను నమ్ముకున్న మనుషులు, సినిమా రంగం బాగుండాలని కోరుకున్న కృష్ణ ఆస్తుల రూపంలో వేల కోట్లు సంపాదించకపోవచ్చు. కానీ, కోట్ల మంది అభిమానుల గుండెల్లో సంపాదించుకున్న ప్రేమ, ఇండస్ట్రీలో ఆయన సంపాదించిన గౌరవం ముందు ఆ లక్షల కోట్ల ఆస్తి కూడా చాలా చిన్నదే అనిపిస్తుంది












Click it and Unblock the Notifications