US-Iran Talks: ఇరాన్ చర్చల్లో నేరుగా ట్రంప్? కీలక నిర్ణయం..!
అమెరికా-ఇరాన్ చర్చలపై (US-Iran Talks) ఉత్కంఠ కొనసాగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగు వేయబోతున్నారు. గతంలో పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చలకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందాన్ని పంపిన ట్రంప్.. ఈసారి మాత్రం తానే నేరుగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కుదరకపోతే మాత్రం కనీసం వర్చువల్ గా అయినా హాజరయ్యేందుకు ట్రంప్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
రేపటితో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగియబోతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో జరిగే రెండో దశ చర్చలకు ఇరు వర్గాలు హాజరు కావాల్సి ఉంది. అయితే ఓవైపు చర్చలకు సిద్ధమవుతూ మరోవైపు ఇరాన్ పై ట్రంప్ (donald trump) బెదిరింపులకు దిగడం చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. దీంతో బెదిరింపుల మధ్య చర్చలకు రాలేమని ఇరాన్ తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాను హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తాజాగా హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా ఇరాన్ జెండా ఉన్న నౌకను స్వాధీనం చేసుకున్న తర్వాత, చర్చలకు హాజరుకాబోమని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ, పాకిస్తాన్‌లో ఇరాన్‌తో శాంతి చర్చలు ముందుకు సాగుతాయని అమెరికా విశ్వాసం వ్యక్తం చేసింది. చమురు ధరలు మరింత పెరగకుండా, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను నివారించే ఒప్పందాన్ని ట్రంప్ కోరుకుంటున్నారు. కానీ ఇరాన్‌కు అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసే సాధనాలు ఉండకూడదని ఆయన పట్టుబడుతున్నారు. దీంతో చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. అటు ఇరాన్.. తన అణు కార్యక్రమానికి ఆటంకం కలిగించకుండా, యుద్ధం పునఃప్రారంభం కాకుండా నివారించి, ఆంక్షలను సడలించే ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి, హార్ముజ్ జలసంధిపై తనకున్న నియంత్రణను ఉపయోగించుకోవాలని ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications