ఇక తెలంగాణలో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు: కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోద ముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డీ లోని (1) (2) క్లాజుల కింద దాఖలుచేయబడిన అధికారాలను అనుసరించి తెలంగాణ పబ్లిక్ ఎంపాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యూలేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018కి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.

పోలీసు నియామకాలు మినహా అన్ని ఉద్యోగాల్లో 95 శాతం
పోలీసు నియామకాలను మినహాయించి మిగిలిని అన్ని విభాగాలకు ఈ జోన్ల విధానం వర్తిస్తుంది. కాగా, దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తూ.. తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థను కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసింది.
ఇప్పటి వరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం.. 70 శాతం పోస్టులను స్థానికులకు కేటాయించగా.. 30 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీ పరిధిలోకి ఉంచేవారు. దీని వల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారనే భావనతో 95 శాతం పోస్టులను స్థానికులకు కల్పించేలా కేసీఆర్ ప్రభుత్వం నూతన జోన్ల విధానానికి రూపకల్పన చేసింది.

కొత్త నోటిఫికేషన్లు నూతన జోనల్ విధానం ప్రకారమే..
ఇక, త్వరలో వెలువడబోయే నోటిఫికేషన్లు నూతన జోనల్ విధానం ప్రకారం భర్తీ చేయనున్నారు. వీటిలో తొలి నాలుగు జోన్లను ఒక మల్టీ జోన్‌గా, తర్వాతి మూడు జోన్లను మరో మల్టీ జోన్‌గా పరిగణిస్తారు.ఇప్పటి వరకూ నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదవితే ఆ జిల్లానే స్థానికతగా పరిగణిస్తారు. ఇక నుంచి ఏడో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు. త్వరలో వెలువడబోయే నోటిఫికేషన్లు నూతన జోనల్ విధానం ప్రకారం భర్తీ చేయనున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జోన్లు ఇవే:
కాళేశ్వరం జోన్: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు
బాసర జోన్: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు
రాజన్న జోన్: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు
భద్రాద్రి జోన్: వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు
యాదాద్రి జోన్: సూర్యపేట, నల్గొండ, యాదాద్రిభువనగిరి, జనగామ జిల్లాలు
చార్మినార్ జోన్: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు
జోగుళాంబ జోన్: మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలు.












Click it and Unblock the Notifications