తండ్రి సూపర్ స్టార్, తల్లి అగ్ర నటి, కొడుక్కి మాత్రం 29 ఫ్లాపులు
తండ్రి పేరు చెబితేనే వెండితెర గర్వంగా తల ఎత్తుతుంది. ఆయనో శకం, ఆయనే లెజెండ్.. అమితాబ్ బచ్చన్! ఇక తల్లి పేరు తలిస్తేనే అభినయానికి అర్ధం మారుతుంది.. ఆమె అగ్రనటి జయా బచ్చన్! ఇలాంటి అసాధారణ నేపథ్యం, తిరుగులేని స్టార్‌డమ్ ఉన్న ఇంట్లో పుట్టిన వారసుడికి బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరచడంలో ఆశ్చర్యమేముంది? కానీ, ఆ రెడ్ కార్పెట్ కాస్తా ముళ్లు తేలిన దారిగా మారుతుందని ఆ కుర్రాడు ఊహించి ఉండడు.
విషాదకరమైన రికార్డు
అభిషేక్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో బాక్సాఫీస్ వద్ద హోరు మామూలుగా లేదు. అమితాబ్ కొడుకు వస్తున్నాడంటే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. భారీ అంచనాలు, విపరీతమైన హైప్ మధ్య 2000 సంవత్సరంలో రిఫ్యూజీ సినిమాతో అరంగేట్రం చేశాడు. అందరూ ఒక సునామీని ఊహించారు, కానీ తెరపై కనిపించింది మాత్రం ఒక నిశ్శబ్ద ప్రయాణం. అక్కడి నుంచే అసలు కష్టాలు మొదలయ్యాయి. అంచనాల మోయలేనంత బరువయ్యాయి. తొలి రోజుల్లో అభిషేక్ కెరీర్‌ను వరుస పరాజయాలు బెంబేలెత్తించాయి. ఒక దశలో ఏకంగా పన్నెండు సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. పడిలేచిన కెరటంలా కొన్ని మంచి హిట్లు పలకరించినా.. అపజయాల పరంపర వెన్నంటే ఉంది. సుమారు రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఏకంగా 29 డిజాస్టర్లు ఆయన ఖాతాలో చేరడం సినీ చరిత్రలో ఒక విషాద రికార్డు.

నటుడిగా తప్పు లేదు
ఇక్కడ అసలైన విషాదం ఏంటంటే.. అభిషేక్ నటుడిగా ఎక్కడా తప్పు చేయలేదు. 'గురు', 'పా', 'దస్వీ' లాంటి చిత్రాల్లో తన అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. కానీ, ప్రేక్షకులు ఆయన్ను అమితాబ్ కొడుకుగా మాత్రమే చూశారు తప్ప, కేవలం అభిషేక్‌గా చూడలేకపోయారు. తండ్రి అందుకున్న శిఖరాలను తాకలేదన్న ఒక్క కారణంతో ఆయనలోని ప్రతిభ చాలాసార్లు నీరుగారిపోయింది. ఇప్పుడు హీరో పాత్రల నుంచి సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన రూట్ మార్చారు. తండ్రి లెగసీని మోస్తూ, దాని నీడ నుంచి బయటపడటానికి ఆయన చేస్తున్న ఈ ఒంటరి పోరాటం నిజంగా ఎవరికీ రాకూడదనే చెప్పాలి. దిగ్గజాల వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, విజయాల కోసం ఇన్ని కష్టాలు పడిన హీరో మరొకరు ఉండరేమో!














Click it and Unblock the Notifications
