అమెరికా ఎన్నికల్లో ఆంజనేయ స్వామి రగడ.. విగ్రహం కూల్చివేతకు కుట్ర?
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కొలువుదీరిన 90 అడుగుల భారీ హనుమంతుడి విగ్రహం కూల్చివేతపై ఓ యూట్యూబర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై అమెరికా మిలిటరీ మాజీ సైనికుడు, హిందూ అమెరికన్ రుచిర్ బక్షి అత్యంత ఘాటుగా స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ దేశాల్లో అమెరికా సైన్యం తరఫున యుద్దరంగంలో పోరాడిన ఆయన.. "నా మతాన్ని నాశనం చేస్తామనే దేశం కోసం, రాజకీయ నాయకుల కోసం.. నేను యూనిఫాం వేసుకుని సరిహద్దుల్లో పోరాడలేదు" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
వివాదానికి దారితీసిన ఘటన ఏంటి?
జెట్సీ హ్యూస్ అనే రైట్-వింగ్ కన్జర్వేటివ్ యూట్యూబర్ టెక్సాస్‌లోని సుగర్ ల్యాండ్‌లో ఉన్న అష్టలక్ష్మి ఆలయంలోని శ్రీ హనుమంతుడి విగ్రహం ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మేము గెలిచిన రోజు.. ఈ విగ్రహాన్ని కూల్చివేస్తాం" అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు రాశారు. ఈ వ్యాఖ్యలపై అమెరికాలో నివసిస్తున్న హిందూ సమాజంతో పాటు మాజీ సైనికుల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 2024 ఆగస్టులో ప్రారంభించిన ఈ 90 అడుగుల 'స్టాచ్యూ ఆఫ్ యూనియన్' అమెరికాలోనే అత్యంత ఎత్తైన మూడో విగ్రహంగా గుర్తింపు పొందింది. అయితే, కొందరు క్రైస్తవులు, కన్జర్వేటివ్ ప్రతినిధులు దీనిని 'హిందూ దేవుడి విగ్రహం కాదు' అంటూ నిరంతరం ద్వేషపూరిత ప్రచారం చేస్తున్నారు.

మాజీ సైనికుడి భావోద్వేగపు నిరసన
యూట్యూబర్ హెచ్చరికలపై ఆర్మీ మాజీ సైనికుడు రుచిర్ బక్షి స్పందిస్తూ.. "ఎవరో థర్డ్ రేట్ టాక్ షో నిర్వాహకుడు వచ్చి నా మతంపై దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి నేను నా కుటుంబాన్ని వదిలేసి యుద్ధంలో పాల్గొనలేదు" అని విమర్శించారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాలను, నమ్మకాలను నాశనం చేయడం ఎప్పటికీ దేశభక్తి అనిపించుకోదని స్పష్టం చేశారు. అమెరికాలో ఉన్న హిందువులు పన్నులు కడుతున్నారని, వ్యాపారాలు నడుపుతున్నారని, వారి పిల్లలు కూడా సైన్యంలో చేరుతున్నారని గుర్తుచేశారు.
దేవుడి కంటే ఎవరూ ఎక్కువ కాదు..
యూనిఫాం ధరించి దేశ రక్షణలో పాల్గొనే క్రమంలో ఎవరూ దేవుడి కంటే ఎక్కువ కాదని బక్షి పేర్కొన్నారు. "నేను సైన్యంలో పనిచేసినప్పుడు నా తోటివారిలో క్రైస్తవులు, యూదులు, ముస్లింలు, నాస్తికులు, హిందువులు కూడా ఉన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడేటప్పుడు ఏ దేవుడు గొప్ప అని ఎవరూ హోదాలు వెతుక్కోలేదు. నా తోటి సైనికులు కొందరు తిరిగి రాలేదు.. అమరులయ్యారు. వారు ప్రాణాలర్పించింది వేరొకరి మతాన్ని కూల్చివేసేందుకు కాదు" అని ఆయన ఆవేదన.
ఎలక్షన్ల వేళ రాజకీయ రంగు
మరోవైపు అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంటోంది. మత స్వేచ్ఛ, వలసదారుల అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారాయి. టెక్సాస్ రాష్ట్రాన్ని దశాబ్దాలుగా రిపబ్లికన్లు ఏలుతున్నప్పటికీ, ఈసారి డెమోక్రాట్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సుమారు 5 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ అమెరికన్ల ఓట్లను ఆకర్షించే క్రమంలో ఈ విగ్రహ వివాదం రెండు పార్టీల మధ్య ప్రధాన చర్చనీయాంశంగా మారింది. బక్షి చేసిన వ్యాఖ్యలకు నార్త్ అమెరికా హిందూ సంఘాలు (CoHNA) సరికొత్త మద్దతు ప్రకటించాయి.














Click it and Unblock the Notifications
