ఏపీలో పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్- అదనపు పెన్షన్ పెంపు-జీవో జారీ..!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు (AP Pensioners)సర్కార్ ఓ శుభవార్త చెప్పింది. నిబంధనల ప్రకారం వయసు పైబడిన పెన్షనర్లకు చెల్లించే అదనపు క్వాంటమ్ పెన్షన్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏయే వయో వర్గాల పెన్షనర్లకు ఎంత మేర పెన్షన్ పెరగనుందనే వివరాలతో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే ఈ పెంచిన పెన్షన్ ఎప్పటి నుంచి వర్తింపచేస్తారో కూడా ఇందులో వెల్లడించింది.
రాష్ట్రంలో 70, 75 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లు, అలాగే కుటుంబ పెన్షనర్లకు గతంలో తగ్గించిన అదనపు పెన్షన్ రేట్లను ప్రభుత్వం ఇప్పుడు పునరుద్దరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్ 126ను జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం 70 ఏళ్లు దాటిన పెన్షనర్లు తమ అసలు పెన్షన్ లో 7 శాతం అదనపు పెన్షన్ పొందుతుండగా.. ఇప్పుడు దాన్ని కాస్తా 10 శాతానికి పెంచింది. అలాగే 75 ఏళ్లు దాటిన వారికి ప్రాథమిక పెన్షన్ లో 12 శాతం అదనపు పెన్షన్ పొందుతుండగా.. ఇప్పుడు దాన్ని 15 శాతానికి పెంచింది. మిగతా అదనపు పెన్షన్లలో ఎలాంటి మార్పు లేదు.

80 ఏళ్లు దాటిన వారికి తమ అసలు పెన్షన్ లో 20 శాతం పెంపు, 85 ఏళ్లు దాటిన వారికి అసలు పెన్షన్లో 25% పెంపు,
90 ఏళ్లు దాటిన వారికి అసలు పెన్షన్లో 30 శాతం, 95 ఏళ్లు దాటిన వారికి అసలు పెన్షన్లో 35 శాతం, 100 ఏళ్లు దాటిన వారికి అసలు పెన్షన్ పై 50 శాతం పెంచి అందిస్తున్నారు. ఈ పెరిగిన అదనపు క్వాంటం పెన్షన్లను ఈ ఏడాది డిసెంబర్ నుంచి వర్తింపచేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే వచ్చే ఏడాది జనవరి 1న అందే పెన్షన్ లో ఈ పెరిగిన మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది.














Click it and Unblock the Notifications
