"అంతా మీరే కాదు.. వాళ్లకీ ఛాన్స్ ఇవ్వండి"-సీఎంకు జనసేన నేత కీలక సూచన..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆయా సంస్థలకు నిధుల కేటాయింపుపై సీఎం చంద్రబాబు ఫొటోలతో తాజాగా వివిధ పత్రికల్లో ప్రభుత్వం భారీ ప్రకటనలకు ఇచ్చింది. దీనిపై స్పందించిన జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) .. కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు (Chandrababu) అంతా తానే కాకుండా స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానిక ప్రజాప్రతినిధులకు పాలనలో భాగస్వామ్యం కల్పించాలని, ప్రకటనలకు భారీ ఎత్తున డబ్బు ఖర్చు పెట్టే బదులు, దాన్ని స్థానిక సంస్థలకు ఇవ్వాలని కోరారు.
ప్రజలచే ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తమ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించడం స్థానిక స్వపరిపాలన స్ఫూర్తి దృష్ట్యా ఆలోచించాల్సిన అంశమే అని బొలిశెట్టి తెలిపారు. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరుగుతున్నప్పుడు, ఈ అభివృద్ధి పనులన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ వల్లే జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడి, "స్థానిక సంస్థల్లో ఏ పార్టీకి ఎక్కువ మంది ప్రతినిధులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనే తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందన్నారు. ఇది స్థానిక స్వపరిపాలన స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి..
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) September 22, 2026
ప్రజలచే ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తమ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్చువల్‌గా ప్రారంభించడం స్థానిక స్వపరిపాలన స్ఫూర్తి దృష్ట్యా ఆలోచించాల్సిన అంశమే..
అది… pic.twitter.com/iu9iTEslK6
భారీ స్థాయి లేదా రాష్ట్ర ప్రాధాన్యమున్న ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం, నిధులు, సమన్వయం అవసరమే, అయితే రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పార్కులు వంటి స్థానిక అవసరాలకు సంబంధించిన పనుల్లో ఎన్నికైన మేయర్లు, కార్పొరేటర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లకు తగిన ప్రాధాన్యం, భాగస్వామ్యం ఉండాలన్నారు. భారత రాజ్యాంగంలోని 74వ రాజ్యాంగ సవరణ, ఆర్టికల్ 243W మరియు పన్నెండో షెడ్యూల్ పట్టణ స్థానిక సంస్థలను స్థానిక స్వపరిపాలన సంస్థలుగా బలోపేతం చేయడానికి రాజ్యాంగబద్ధమైన పునాదిని కల్పించాయి. పట్టణ ప్రణాళిక, రహదారులు, నీటి సరఫరా, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, పార్కులు, వీధి దీపాలు తదితర అంశాలు పన్నెండో షెడ్యూల్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. అలాగే మున్సిపాలిటీల చట్టంలో ప్రజా వీధులు, డ్రైన్లు, డ్రైనేజీ వ్యవస్థలు, నీటి సరఫరా, లైటింగ్ తదితర పట్టణ మౌలిక వసతులకు సంబంధించి స్థానిక సంస్థల బాధ్యతలు, అధికారాలు ప్రస్తావించబడ్డాయని గుర్తుచేశారు. కాబట్టి స్థానిక అభివృద్ధి పనులను ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభించడం ద్వారా 74వ రాజ్యాంగ సవరణ ఆశయమైన స్థానిక స్వపరిపాలనను మరింత బలోపేతం చేయవచ్చని సూచించారు. అలాగే ప్రకటనలకు చెల్లించే డబ్బు విషయంలో పారదర్శకత పాటించాలని కోరారు.














Click it and Unblock the Notifications
