విదేశీ కోచ్ ఘాతుకం.. మైనర్ అథ్లెట్‌పై అత్యాచారం!
పంజాబ్‌లోని పటియాలాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇక్కడ శిక్షణ పొందుతున్న ఓ మైనర్ అథ్లెట్‌పై కజకిస్తాన్‌కు చెందిన సైక్లింగ్ కోచ్ మక్సాత్ అయెజ్ బాయెవ్ అత్యాచారానికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పటియాలా పోలీసులు విదేశీ కోచ్‌పై పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దారుణం సెప్టెంబర్ 13న జరగగా.. సెప్టెంబర్ 18న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు తీవ్రతను గుర్తించిన పటియాలా ఎస్పీ సిటీ మోహిత్ అగర్వాల్ తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్లు 64(2), 351(3)తో పాటు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధితురాలికి అవసరమైన వైద్య పరీక్షలు పూర్తి చేశారు.

మరోవైపు నిందితుడైన కజకిస్తాన్ కోచ్ ఢిల్లీలో జరుగుతున్న ఓ సైక్లింగ్ శిబిరంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతను ఎక్కడ దాక్కున్నాడనే దానిపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు.
కాగా ఈ సున్నితమైన కేసు విషయంలో మీడియా, ప్రజలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోక్సో చట్టం నిబంధనల ప్రకారం బాధితురాలైన మైనర్ అథ్లెట్ గుర్తింపును, పేరును లేదా ఇతర వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెల్లడించకూడదని స్పష్టం చేశారు. అలాగే బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు.














Click it and Unblock the Notifications
