ఆ చిన్న పల్లెటూరులో బాలకృష్ణ సంచలన రికార్డ్
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన చిత్రాల్లో నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డు నెలకొల్పింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని మండల కేంద్రమైన కామవరపుకోట చిన్న పల్లెటూరు. 20 సంవత్సరాల క్రితం ఇలాంటి పల్లెటూరిలో సినిమా విడుదల చేయడం అంటే పెద్ద సాహసం అని చెప్పాలి.
కామవరపుకోట లోని శ్రీలక్ష్మి టాకీస్ థియేటర్ యజమానులు కోటగిరి వేణుబాబు, కోటగిరి కిషోర్ బాబు పట్టుబట్టి తమ థియేటర్ లో సినిమా విడుదల చేయించారు. పెద్ద సెంటర్లలో సినిమాలు విడుదలై 100, 150 రోజులు ఆడిన తర్వాత ఆరునెలలకో, ఏడు నెలలకో కామవరపుకోటకు వచ్చేవి. ఈ ఊరికి18 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణం ఉంది.. అక్కడ అన్ని సినిమాలు విడుదలయ్యేవి. అలాగే 25 కిలోమీటర్ల దూరంలో చింతలపూడి ఉంది. అక్కడ కూడా కొత్త సినిమాలు విడుదలయ్యేవి.

కామవరపుకోటలో కొత్త సినిమా విడుదల చేయాలంటే ఏ డిస్ట్రిబ్యూటర్ సాహసం చేయలేరు. కానీ కోటగిరి బ్రదర్స్ తమ థియేటర్ లో నరసింహనాయుడిని విడుదల చేయాలని పట్టుబట్టారు. 20 రోజలు కూడా ఆడదు.. అనవసరంగా వీరు రిస్క్ చేస్తున్నారా? అని అందరికీ అనిపించింది. అప్పుడు మంత్రిగా ఉన్న వీరి పెదనాన్న దివంగత కోటగిరి విద్యాధరరావు రికమెండ్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్ కామవరపుకోటలో నరసింహనాయుడిని విడుదల చేశారు. రూ.1.80 లక్షలకు ఒప్పందం కుదిరించింది.
నెల రోజులపాటు పది రూపాయల ఫ్లాట్ టిక్కెట్ పెట్టారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో నెల రోజులు నాలుగు ఆటలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం లాంటి పట్టణాల నుంచి ప్రజలకు కామవరపుకోట వచ్చి నరసింహనాయుడు చూసేవారు. 101 రోజులు పూర్తిచేసుకుంది. ఇక్కడకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెంలోని సౌభాగ్య థియేటర్ లో కూడా 100 రోజులు ఆడింది. ఇక్కడ ఫైనల్ గా రూ.11 లక్షల గ్రాస్ వసూలు చేసింది. థియేటర్ యాజమాన్యానికి నిర్మాత టాటా సుమో కారును బహుకరించారు. ఆ తర్వాత ఏ సినిమా కూడా ఇక్కడ 50 రోజులు ఆడలేదు. 2004 సంక్రాంతి కానుకగా మళ్లీ బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ సినిమా విడుదలై 51 రోజులపాటు ఆడింది.












Click it and Unblock the Notifications