'దేవర'కు కళ్లు చెదిరే ఆఫర్!
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా చేస్తున్న చిత్రం దేవర. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ కల్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలందిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయిక. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ హీరోగా మారిన తర్వాత వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఈ చిత్రానికి బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. దీనికి సంబంధించిన వార్తను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకునేందుకు నెట్ ఫ్లిక్స్ రూ.155 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ కు పాన్ ఇండియాతోపాటు గ్లోబల్ హీరోగా ఇమేజ్ వచ్చింది. ఆచార్య సినిమా ఫ్లాపవడంతో కొరటాల శివ రెండు సంవత్సరాలు కసిగా కూర్చొని కథను తయారుచేసుకున్నారు. కచ్చితంగా ఈ సినిమా భారీ హిట్ కొడుతుందనే అంచనాలను తారక్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా హక్కులను సొంతం చేసుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన టాప్ ప్రొడ్యూసర్లు కూడా రంగంలోకి దిగారని, వారినుంచి నిర్మాతలకు భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ లెక్కలను చూసి టాలీవుడ్ షేకవుతోందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ అందించారు. దేవర కూడా హిట్టయితే తారక్ ఇమేజ్ ఒక రేంజ్ లో ఉంటుందని, సినిమా విజయాన్ని బట్టి పాన్ ఇండియాగానే కాకుండా అంతర్జాతీయంగా వివిధ భాషల్లోకి అనువదించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.












Click it and Unblock the Notifications