ఓం శాంతి శాంతి శాంతిః రివ్యూ: యుద్ధానికి రెడీ!
సాధారణంగా పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల కలయిక అంటారు. కానీ ఈ సినిమాలో పెళ్లంటే.. ఒక అహంకారానికి, ఒక ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధం. మలయాళ మ్యాజిక్ తెలుగులో ఏ మేరకు పండిందో ఇప్పుడు చూద్దాం.
కథ
గోదావరి గట్టున పెరిగిన మధ్యతరగతి అమ్మాయి శాంతి (ఈషా రెబ్బా). చిన్నప్పటి నుండి "ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి" అనే ఆంక్షల మధ్య పెరిగి, తన ఇష్టాలను తాకట్టు పెట్టి.. చేపల చెరువుల యజమాని ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్)ని పెళ్లి చేసుకుంటుంది. బయటకి చాలా పద్ధతిగా కనిపించే ఓంకార్‌కి కోపం వస్తే మాత్రం చేతులు ఊరుకోవు. చిన్న విషయానికే శాంతిని కొడుతూ రాక్షసానందం పొందుతుంటాడు. అయితే, ఎప్పుడూ దెబ్బలు తింటూ ఏడ్చే శాంతి ఒకరోజు ఊహించని విధంగా తిరగబడుతుంది. ఆ తర్వాత ఓంకార్ పరిస్థితి ఏంటి? శాంతి తన ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది? అనేదే ఈ 'సెటైరికల్' డ్రామా.

విశ్లేషణ:
ఓటీటీలో ఒరిజినల్ వెర్షన్ అందుబాటులో ఉన్నా, ఈ సినిమాను తెలుగులో చూడడానికి ప్రధాన కారణం నేటివిటీ. గోదావరి యాస, అక్కడి మధ్యతరగతి ఇళ్లలోని వాతావరణాన్ని దర్శకుడు చాలా సహజంగా చూపించారు.భార్యపై భర్త చేసే దాడులను సీరియస్ ఎమోషన్ లా కాకుండా, వ్యంగ్యంగా చూపించడం ఈ సినిమా స్పెషాలిటీ.
తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు ఊపిరి పోశారు. ఒక బాధ్యత లేని, అహంకారి అయిన భర్తగా ఆయన నటన నభూతో నభవిష్యతి. ఇక ఈషా రెబ్బా తన పాత్రలో ఒదిగిపోయింది. అయితే, ఆమె రూపంలో ఉండే సహజమైన ధైర్యం వల్ల, మొదట్లో ఆమె పడే కష్టాలు చూసి ప్రేక్షకులు కొంత సింపతీ పొందడం కష్టమవుతుంది.క్లైమాక్స్ కు ముందు వచ్చే ఆ 'షాకింగ్' ఫైట్ సీక్వెన్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తుంది.
సాంకేతిక వర్గం:
సినిమాలోని డైలాగులు చాలా షార్ప్ గా ఉన్నాయి. ముఖ్యంగా పురుషాహంకారంపై వేసిన సెటైర్లు ఆలోచింపజేస్తాయి. సంగీతం మరియు నేపథ్య సంగీతం కథలోని కామెడీ టైమింగ్‌ని బాగా ఎలివేట్ చేశాయి. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉండటంతో సినిమా ఎక్కడా సాగదీసినట్లు అనిపించదు.
ప్లస్ పాయింట్స్:
తరుణ్ భాస్కర్ విశ్వరూపం.
తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చిన స్క్రీన్ ప్లే.
సమాజంలోని లింగ వివక్షపై వేసిన సెటైర్లు.
నిడివి తక్కువగా ఉండటం.
మైనస్ పాయింట్స్:
ఒరిజినల్ చూసిన వారికి కొత్తదనం అనిపించదు.
హీరోయిన్ పాత్రలో మొదట ఉండాల్సిన 'అమాయకత్వం' మిస్ అవ్వడం.
బాటమ్ లైన్:
మలయాళ వెర్షన్ చూడని వారికి 'ఓం శాంతి శాంతి శాంతిః' ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్. చూసిన వారికి మాత్రం తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు. మొత్తానికి, ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. భార్యను చులకనగా చూసే ప్రతి భర్తకు ఒక గట్టి వార్నింగ్.
పంచ్ లైన్: భర్తలకు 'ఓం', భార్యలకు 'శాంతి'
మా రేటింగ్: 2.5/5












Click it and Unblock the Notifications