ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్‌లైన్‌లో HD ప్రింట్ ప్రత్యక్షం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు థియేటర్లలోకి వచ్చిన తొలిరోజే బిగ్ షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ భూతానికి చిక్కింది. పైరసీ భూతాన్ని తరిమికొట్టాలని సినీ అభిమానులు, నటీనటులు, నిర్మాతలు ఎంతగా పోరాటం చేస్తున్నా కొత్త కొత్త లింకులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఏకంగా ఈ సారి పవర్ స్టార్ సినిమాను విడుదల మొదటి రోజునే లీక్ చేయడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
పైరసీ సైట్లలో ప్రత్యక్షం
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సినిమా విడుదలైన కొద్దిసేపటికే కొన్ని పైరసీ వెబ్‌సైట్లలో కనిపించింది. పైరసీ వెబ్‌సైట్లో హెచ్‌డీ క్వాలిటీతో ప్రత్యక్షమైంది. థియేటర్లలో ఫ్యాన్స్ గోల మధ్య ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇలా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

చిత్ర యూనిట్ ఆందోళన
హరీష్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై నిర్మాతలు భారీగా పెట్టుబడి పెట్టారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న తరుణంలో, ఇలా లీక్ అవ్వడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.పైరసీ అనేది చట్టరీత్యా నేరం. కష్టపడి తీసిన సినిమాను థియేటర్లలోనే చూసి చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని మేకర్స్ కోరుతున్నారు.
రంగంలోకి సైబర్ క్రైమ్
లీకేజీ వార్త తెలియగానే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఎవరైనా లీకైన వీడియోలను షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు."సినిమాను థియేటర్లలోనే చూడండి, పైరసీని ప్రోత్సహించకండి" అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇంకా ఇలాంటి పైరసీ సైట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఐ బొమ్మ ఘటనను మరువకముందే ఇలా స్టార్ సినిమాలను లీక్ చేయడం సినీ వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. ఇలా పైరసీ రక్కసిని పెంచి పోషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications