తెలంగాణ: చిరంజీవి స్పష్టత

చిరంజీవి తెలంగాణపై గోడ మీది పిల్లి వాటంలా వ్యవహరిస్తే లాభం లేదు. కచ్చితమైన నిర్ణయమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయన మరింత స్పష్టంగా ముందుకు అవకాశాలున్నట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆచితూసి ప్రతిస్పందించడం ఆ విషయాన్ని సంకేతిస్తున్నాయి. చిరంజీవి తెలంగాణ ప్రకటనపై కెసిఆర్ ఆచితూచి ప్రతిస్పందించారు. చిరంజీవి తనది తుది నిర్ణయం కాదన్నారని, తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడుతానని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా రానున్న చిరంజీవిని తమ వ్యాఖ్యల ద్వారా దూరం చేసుకోవడం ఎందుకనే అభిప్రాయం చంద్రశేఖరరావుకు ఉండి ఉంటుంది. కెసిఆర్ అప్పట్లో ఢిల్లీలో బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను, బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ జవేదకర్ ను కలవడం కూడా ఇందులో భాగమే కావచ్చు. బహుశా, తెలంగాణవాదులందరినీ ఎన్నికల నాటికి ఒక తాటి మీదికి తేవడమే కాకుండా తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలను కూడా కలుపుకుని వచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్లు ఒక ప్రచారం సాగుతున్నది. ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు గానీ అవకాశం మాత్రం లేకపోలేదు.
తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అందుకే తెలుగుదేశంలో తెలంగాణవాదుల లొల్లి సద్దుమణిగినట్లు అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశంలోని తెలంగాణేతర నాయకులు కూడా దీన్ని అంగీకరించినట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. వామపక్షాల్లో ఒక సిపిఎంతోనే పేచీ ఉంది. కాంగ్రెసును ఓడించే ప్రయత్నంలో సిపిఎం ప్రధాన పాత్ర పోషించాలని అనుకుంటున్నది. అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చి ఆ పనిని పూర్తి చేయాలని అనుకుంటున్నది. ఇప్పటికే సిపిఎం, సిపిఐలతో కలిసి తెరాస ఆందోళనలు చేస్తున్నది. శాసనసభలో తెలుగుదేశం, తెరాస ఏకతాటిపై నడుస్తున్నాయి. శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసును ఈ రెండు పార్టీలు కలిసి శాసనసభ సచివాయల కార్యదర్శి తుల్జానంద సింగ్ కు అందజేశాయి.
మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరిగే అవకాశం ఉంది. చిరంజీవి దానికి పాదులు వేసినట్లు గుర్తించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications
