• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విడిపోవటం తెలంగాన ప్రజల జన్మ హక్కు

By Pratap
|

Telangana
సమైక్యవాదాన్ని ప్రచారం చేస్తున్న లగడపాటి,రాయపాటి,బోయపాటి, ఇతర ఘనాపాటీలు, నేనిలు,టి.జిలు తదితరులు గమనించవలసింది, తెల్సుకోవాల్సింది ఏమిటంటె...సమైక్యత ఒక సామాజిక విలువ.. హక్కు కాదు. విడిపోవడం మాత్రం ఒక హక్కు. భార్యాభర్తలు, అన్నాదమ్ములు, జాతులు ఒక సమాఖ్యగా కల్సిఉండడం ఎప్పుడైనా ఒక విలువే తప్ప హక్కు కాదు. కల్సి ఉండటం ఇద్దరు లేదా కల్సి ఉండాలనుకునే వాల్లందరి పరస్పర అంగీకారం మేరకే జరుగుతుంది .జరగాలి కూడా. కాని అయిష్టంగా , బలవంతంగా కల్సి ఉండటం, కల్సిఉండాలనటం అప్రజాస్వామికం. పరస్పర అంగికారం లేని కాపురాలు, వ్యాపార భాగస్వామ్యాలు ,ఉమ్మడి కుటుంబాలు , జాతుల సమాఖ్యలు ఎన్నటికి నిలువజాలవు.

అన్యాయానికి, దోపిడికి, వివక్షకు గురి అవుతున్న భాగస్వామ్య పక్షాలు విడి పొయి స్వతంత్రంగా బతకాలనుకోవటం ప్రపంచమంతా అంగీకరించిన హక్కు. విడిపోయే హక్కును కల్సి ఉండాలన్న విలువతో అడ్డుకోవాలనుకోవటం హక్కుల భావనకే విరుద్దం. సీమాంధ్రులు కల్సి ఉండటాన్ని కూడా ఒక హక్కుగా భావించి సమైక్యతను తెలంగాన ప్రజల మీద రుద్దుతున్నారు.హక్కుల భావనకే కొత్త భాష్యం చెబుతున్నారు. సమైక్యత అనే విలువను ఎవరికి భోదించాలి? సమైక్యంగా ఉండాలనుకుంటున్న వాళ్లకా? విడిపోతమనుకుంటున్నవాళ్లకా? సమైక్యవాద ప్రచారం చేయవల్సింది విజయవాదలో,విశాఖలో,తిరుపతిలో, కర్నూలులో,కడపలో కాదు.వరంగల్,కరీంనగర్,నిజామాబాద్,ఆదిలాబాద్,మహబూబ్ నగర్,నల్లగొంద,మెదక్ తదితర తెలంగాన జిల్లాలలో, పట్నాలలో, గ్రామాలలో జరగాలి. తెలంగాణ ప్రజలు ఎప్పటినుంచో అడుగుతున్న ప్రశ్నలకు మౌనం వహించి , సమైక్య రాష్త్ర ఏర్పాటుకు ఉన్న అన్ని ప్రాదిపదికలను ద్వంసం చేసి ఇవ్వాల సమైక్యవాదం వర్ధిల్లాలి అంటె ఏం ప్రయోజనం? తెలంగానను అన్ని రంగాలలో దోపిడికి, అనిచివేతకు, వివక్షకు గురి చేసి ఇవ్వాల కలసి ఉంటె కలదు సుఖం అంటె నమ్మేదెవరు? 610 జీవోను, గిర్ గ్లాని సిఫారసులను అమలు చెయ్యమని ఉద్యమించే తెలంగాన ఉద్యోగులను అండమానుకు పంపాలన్న టిజి కి సమైక్య రాష్త్రం కోరుకునే అర్హత ఉందా?

దేశంలో రాష్ట్రాలు ఏర్పడటం కొత్త కాదు.14 రాష్ట్రాలుగా ఉన్న దేశం 28 రాష్ట్రాలుగా మారింది. రాష్ట్రాల సరిహద్దులు కూల్చలేని రాతి గోడలు కావు. 70 ఏండ్ల పాటు జాతుల సమాఖ్యగా కొనసాగిన సొవియట్ యూనియన్ విఛ్ఛిన్నమయి జాతులు దేశాలుగా అవతరించిన చరిత్ర ఇటీవలిదే. ఎటువంటి హింసకు తావు లేకుండానే ఈ దేశాల ఆవిర్భావం జరిగింది. జాతుల సమాఖ్యగా సోవియట్ యూనియన్ ఏర్పాటైనపుడు జాతులకు ఎపుడైనా సమాఖ్య నుండి విడిపోయే హక్కును కల్పించాడు లెనిన్. సోవియట్ యూనియన్ రాజ్యాంగంలో పొందుపర్చిన జాతుల స్వయంనిర్ణయాధికార హక్కు కారనంగా సోవియట్ యూనియన్ జాతి రాజ్యాలుగా విడిపోవడం సులువైంది. యుగోస్లావియాలో కూడా జరిగింది. జర్మన్ జాతిని రెండో ప్రపంచ సామ్రజ్యవాద యుద్ధం రెండుగా చీల్చింది. జర్మన్ ల ఏకీకరన కోసం రెండూ దేశాలలోని జర్మన్ లు పరితపించారు. తమకు అడ్డుగా ఉన్న బెర్లిన్ గోడను కూల్చి జర్మన్ లు ఐక్యమైనారు. ఈ ఏకీకరణ రెందు దేశాలలోని జర్మన్ ప్రజల పరస్పర అంగీకారం మేరకే జరిగింది తప్ప బలవంతంగా చేసిన ఏకీకరణ కాదు.

అదే విధంగా సోవియట్ యూనియన్ జాతుల సమాఖ్యగా ఏర్పడటం ప్రజల అంగీకారం మేరకే జరిగింది. సమాఖ్య నుండి విదిపొవాలనుకున్నపుడు ఒక హక్కుగా విడిపోయి జాతి రాజ్యాలుగా ఏర్పాటైనారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి ఎన్నో ఉదాహరనలు చెప్పుకోవచ్చు.ఇక్కడ సారాంశం ఏమిటంటె సమైక్యత పరస్పర అంగీకారం అనే విలువ పునాదిగా ఏర్పడాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అటువంటి సంపూర్న పరస్పర అంగీకారం మేరకు జరిగింది కాదని చరిత్రలోకి వెలితే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బేషరతుగా ఏర్పడింది కాదు. పెద్ద మనుషుల ఒప్పందం అనే షరతుల పునాదిగా ఏర్పడింది.కాబట్టి తమకు అన్యాయం జరిగింది అని తెలంగాణ ప్రజలు భావిస్తే విడి పోయే హక్కు వారికి ఉంటుంది. ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తెలంగాన ప్రజలకున్న ఈ హక్కును గుర్తించాడు కనుకనే 5 మార్చి 1956 న నిజామాబాద్ లో విలీన ప్రకటన చేసినపుడు ... భవిషత్తులో తెలంగాణ ప్రజలు ఎప్పుడు కోరుకుంటె అప్పుడు విడిపోవచ్చునని ప్రకటించాడు. ఆయితే ప్రపంచమంతా గుర్తించిన విడిపోయే హక్కును సీమాంధ్ర సమైక్యవాదులు మాత్రం గుర్తించడం లేదు. పైగా సమక్యవాదమనే ఒక విలువని హక్కుగా గుర్తించమంటున్నారు. హక్కుల భావనకే కొత్త భాష్యం చెబుతున్నారు. ఇవ్వాల తెలంగానలో సమైక్యవాదం సమూలంగా నాశనం అయింది. అయినా సమైక్యవాదులు తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఆంధ్తప్రదేశ్ కొనసాగాలని కుట్రలు పన్నుతున్నారు.

1948 వరకు తెలంగాన ఒక దేశం. ఆ తర్వాత భారత దేశంలో ఒక రాష్ట్రమైంది.తెలంగాన ప్రజలు భారత జాతిలో స్వచందంగా ఇక్యమైనారు.1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తెలంగాన ప్రజలకు భావసమైక్యత ఏర్పడలేదు. సీమాంధ్ర పలక వర్గాలు ఇందుకు ఏ క్రుషి చెయ్యలేదు. సాంస్క్రుతిక రంగంలోనూ అటువంటి క్రుషిలో సీమాంధ్ర మేధావి వర్గాలు దూరంగా ఉన్నాయి. నిర్లిప్తంగా ఉండిపోయాయి. ఇవ్వాల తెలంగాన - ఆంధ్ర సమాజాలు నిట్ట నిలువునా చీలిపోయిన స్థితిలో ఇంకా సీమాంధ్ర పెట్టుబడిదారి వర్గాలు సమైక్యవాదాన్ని పట్టుకుని,చూరుకు వేల్లాడే గబ్బిలాల మాదిరి , వేలాడడం శోచనీయం.మానసికంగా విడిపోయిన తెలంగాన ప్రజలు ఇక ఆంధ్రప్రడెశ్ అనే రాష్ట్రంతో భావసమైక్యత సాధించడం దుర్లభం. ఇక బౌతిక విభజన ద్వారా తెలంగాన ప్రజల భారత జాతీయతా భావనను కాపాడుకోవాల్సిన కర్తవ్యం భారత పాలకవర్గాలదే." కుండల్లగా విడిపోదాం కావడిలా కల్సిందాం " అని అంటున్న సీమాంధ్ర దలిత బహుజన మేధావుల మాటను సీమంధ్ర ప్రజలు ఎత్తి పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల మధ్య విధ్వేషాలు వైషమ్యాలు రేకెత్తించే వారిని ఎండగట్టాల్సిన భాధ్యత సీమాంధ్ర ప్రజలది, మేధావులది, ప్రజాస్వామ్యవాదులది.

- శ్రీధరరావు దేశ్‌పాండే

రచయిత అభిప్రాయాలతో దట్స్ తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ వ్యాసంపై చర్చలో కూడా పాల్గొనవచ్చు.

English summary
Writer Sridhar rao Deshpande expressed his opinion that it is the right of Telangana people to divide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X