వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‌కెఎన్ రామదాస్‌: నైజాం రాజ్యంలో అంబేడ్కరిజం

By Pratap
|
Google Oneindia TeluguNews

అంబేడ్కర్‌ పాతకాపు. అంబేడ్కర్‌కు నైజాం రాజ్యానికి అవినాభావ సంబంధం ఉండేది. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా సికింద్రాబాద్‌లోని పెండర్‌గాస్ట్‌ రోడ్డులో ఉంటుండేవాడు. ఔరంగాబాద్‌లో అంబేడ్కర్‌ నెలకొల్పిన మిలింద్‌ విద్యాలయానికి నిజాం పది లక్షల రూపాయలు గ్రాంటు ఇచ్చారు. దానికి హైదరాబాద్‌ అంబేడ్కర్‌గా పేరుగాంచిన వి.యస్‌. వెంకట్రావు హైదరాబాద్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న చొరవ మరువలేనిది. ఔరంగాబాద్‌, హైదరాబాద్‌ రాజ్యంలో ఒక భాగం. అందువల్ల థాబ్దాల తరబడి మహారాష్ట్రలోవారినే నైజాం రాజ్యానికి అంబేడ్కర్‌ రాకపోకలు, భావాలు, సంబంధాలు నిరంతరం కొనసాగుతుండేవి.

భాగ్యరెడ్డివర్మ, ఆది హిందు ఉద్యమాన్ని ముందుకు తీసుకొని చరిత్రను సృష్టించారు. మహాత్మా జ్యోతిబా ఫులే వలే బాలికలకు చాదర్‌ఘాట్‌ వద్ద పాఠశాలను 1905లో నెలకొల్పారు. మన్యం సంఘం, డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ సంస్థలను, ఉద్యమాలను నిర్వహించారు. రెడ్డి, వర్మ అనే పదాన్ని కులవాచకంగా ఎందుకు చూడాలని ప్రశ్నించి దళితులు రెడ్డి, వర్మ అను పేర్లను తమ పేర్ల చివర పెట్టుకునే ఉద్యమాన్ని విస్తృతంగా నడిపారు. అంబేడ్కర్‌ పూర్తిస్థాయిలో జాతీయనాయకుడిగా ఇంకా ఎదగకముందు అణగారిన వర్గాల ఉద్యమాలకు భాగ్యరెడ్డివర్మ నాయకత్వం వహించారు. మచిలీపట్నంలో, లక్నోలో జరిగిన అణగారిన వర్గాల జాతీయ మహాసభలకు అధ్యక్షత వహించారు. అంబేడ్కర్‌లోని శక్తిసామర్ధ్యాలను, జ్ఞానాన్ని తపనను గమనించి తనకన్నా చిన్నవాడైనప్పటికీ అంబేడ్కర్‌ను తమ సామాజిక వర్గాలకు గురువుగా, నేతగా గుర్తించి గౌరవించారు.

ఆక్రమంలోనే వి.ఎస్‌. వెంకట్రావ్‌, బి.ఎమ్‌. గౌతమ్‌, అరిగె రామస్వామి, కె.ఆర్‌. వెంకటస్వామి, ఆదయ్య, శ్యాంసుందర్‌, జె.ఎస్‌.కృష్ణమూర్తి, పి.వి. మనోహర్‌, జె.ఎస్‌. రాజమణిదేవి, జె. ఈశ్వరీభాయి, కె.సదాలక్ష్మి, జె. సుబ్బయ్య, సుమిత్రాదేవి, పి.ఆర్‌. వెంకటస్వామి తదితరులు అంబేడ్కర్‌ సహచరులుగా, అనుచరులుగా హైదరాబాద్‌ రాజ్యంలో అనేక ఉద్యమాలను ముందుండి నడిపారు. హైదరాబాద్‌ రాజ్యంలో అనేక సంస్కరణలను తీసుకొని వచ్చారు.

BS Ramulu

అందువల్ల హైదరాబాద్‌ రాజ్యంలో దళిత ఉద్యమాలు విస్తారంగా సాగిన చరిత్ర కనపడుతుంది. దాంతోపాటు హైదరాబాద్‌ రాజ్యంలోని దళితులనుండి పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, మంత్రులు, శాసనసభ్యులు ఎందరో ఎదిగారు. హైకోర్టు, సిటీ కాలేజి, అసెంబ్లీ, సాలార్జంగ్‌ మ్యూజియం, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, హుస్సేన్‌సాగర్‌ మొదలైన కట్టడాలలో దళిత కాంట్రాక్టర్లు, మేస్త్రీలు, కార్మికులు ప్రధానపాత్ర వహించారు. అలా హైదరాబాద్‌ రాజ్య నిర్మాణంలో, అభివృద్ధిలో దళిత ఉద్యమకారుల పాత్ర ఎనలేనిది. వారు నిరంతరం చైతన్యంతో హైదరాబాద్‌ రాజ్యంలో ఎన్నో అభివృద్ధి ప్రణాళికలను, విద్య, వైద్య సౌకర్యాలను ఆయా వృత్తులకు సబ్సిడీలను, శిక్షణా కేంద్రాలను సాధించారు.
ఈ తరం తర్వాత 1956 నవంబర్‌ నుండి హైదరాబాద్‌ రాజ్యం మూడు ముక్కలు చేయబడి కొంత కర్నాటకలో, కొంత మహారాష్ట్రలో కలపబడింది. కొంత ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతంగా వ్యవహరించే ప్రాంతాన్ని మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా కలిసిపోయింది. అలా హైదరాబాద్‌ రాజ్యం చరిత్ర ఎవరికీ పట్టనిదిగా మారిపోయింది.
అయితే భాగ్యరెడ్డివర్మ గురించి హైదరాబాద్‌ రాజ్య దళిత ఉద్యమాల గురించి, మరాఠీలో, ఇంగ్లీషులో అనేక పుస్తకాలు వెలువడ్డాయి. మరికొన్ని ఉర్దూలో కూడా వెలువడి ఉంటాయి. సీమాంధ్ర నాయకత్వంలో ముఖ్యంగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక తెలంగాణ మొత్తం చరిత్ర పాఠ్యపుస్తకాలనుండి తొలగించబడింది. తెలంగాణకు చరిత్రనే లేకుండా చేయడం జరిగింది. అదే క్రమం కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు కొనసాగించారు. పి.వి. నరసింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక భూ సంస్కరణలను, బి.సి. రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. దాంతో సీమాంద్ర కమ్మ, రెడ్డి, భూస్వామ్య వర్గాలు భూములు కోల్పోతున్నామని, ఉద్యోగాలు కోల్పోతున్నామని జై ఆంధ్ర ఉద్యమాన్ని ముందుకు తెచ్చి పి.వి. నరసింహారావును పదవీచ్యుతుణ్ణి చేశారు. అలా పి.వి. నరసింహారావు తెలంగాణ రాష్ట్ర చరిత్రను, సంస్కృతిని పాఠ్యపుస్తకాల్లోకి తీసుకొచ్చే వ్యవధి లేకుండా చేశారు.

ఈ చరిత్రంతా ఇంకా వెలికితీయబడివలసే ఉంది. ఈ క్రమంలో కె.ఎన్‌. రామదాస్‌ వంటి ఆనాటి యువతరం ఎదుగుతూ వచ్చింది. మౌఖికంగా సాగిన చరిత్ర రచన క్రమం గ్రంథస్థం కాలేకపోయింది. నిజానికి గ్రంథస్థమైన ఇంగ్లీషు, మరాఠీ భాషనుంచి తెలుగులోకి రాలేదని చెప్పడం సబబుగా ఉంటుంది.
కె.ఎన్‌. రామదాస్‌ పూర్వీకులు కరీంనగర్‌ జిల్లా వెదిర గ్రామం నుండి వలస వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రామదాస్‌ హైదరాబాద్‌లోని ప్రేమ్‌నగర్‌, బంజారాహిల్స్‌ ప్రాంతంలో పుట్టి పెరిగారు. తొలిథలో కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితులయ్యారు. కమ్యూనిస్టుల భావజాలంలోకి రావడానికి కామ్రేడ్‌ ఎం.కె. స్వామి, లక్ష్మీదాసు ఎంపి, స్పూర్తినిచ్చారు.

కొండ నర్సింహ, కొండ లచ్చమ్మ దంపతులకు 1942 ఏప్రిల్‌లో జన్మించిన రామదాస్‌ ఉన్నత విద్యావంతుడు. అనేక డిగ్రీలను సాధించారు. అత్యున్నత విద్యను సాధించాలని అంబేడ్కర్‌ను ఆశయంగా పెట్టుకుని నిరంతరం విద్యనభ్యసించారు. ఇప్పటికీ ఇంకా చదువుకోవాలని ఆశపడుతుంటాడు. ఇప్పటికీ తనకు నచ్చిన కొత్త పుస్తకాలను కొని భద్రపరుస్తుంటారు. చదువుతుంటారు.

తండ్రి నర్సింహకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లచ్చమ్మకు నలుగురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఇపుడు ఒక రాందాస్‌ మాత్రమే మిగిలాడు. రెండో భార్య కొండ సాలమ్మకు ఆరుగురు పిల్లలు. కొండ నర్సింహ ఒక కాంట్రాక్టర్‌ ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఆస్పిటల్‌, నీలోఫర్‌ హాస్పిటల్‌, పంజగుట్ట కాలనీకి గ్రానైట్‌ని సప్లై చేశాడు. అంబేడ్కర్‌ పుట్టిన కాలంలో బహుశ 1890లో పుట్టిన నర్సింహ 70 ఏళ్ళ వయస్సులో 1960లో మరణించారు. నర్సింహ అంబేడ్కర్‌ను స్వయంగా చూసి, నా పిల్లలు కూడా అలా ఉన్నతంగా చదువుకొని ఎదగాలని జీవితాదర్శంగా తీసుకున్నాడు. అలా అందర్నీ బాగా చదివించాడు. నర్సింహ నవాబుదగ్గర స్థలం కొన్నాడు. అందులో ఒక వీధిని నిర్మించడానికి పూనుకున్నాడు. ప్రేమ్‌నగర్‌లోని అంబేడ్కర్‌ వీధిలో అందరూ కరీంనగర్‌ జిల్లావాసులే వుండటానికి నర్సింహ కృషే కారణం.

ప్రస్తుతం ఆ వీధిని నవయాన సమతా బుద్ధవిహార్‌ వీధి అని పిలుస్తుంటారు. రాందాస్‌ తన యింటి స్థలంలో అంబేడ్కర్‌ నవయాన సమతా బుద్ధ విహార్‌ను 18-05-1970న స్థాపించారు. బుద్ధవిహార్‌ కట్టడంతో పాటు 1977లో సమతా విద్యాలయం స్థాపించి ఒకటవ తరగతినుండి 10వ తరగతిదాకా నడిపించాడు. పేద పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యంతో తక్కువ ఫీజులతో నడిపిస్తూ, తాను చేసే ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో జీతాలు ఇచ్చేవాడు. 28 సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా అనేక వ్యయప్రయాసలకూర్చి పాఠశాలను నడిపారు. పాఠశాలలో 7వ తరగతి, 10వ తరగతి ఫెయిల్‌ అయితే ఫీజులు వాపసు ఇస్తానని హామీ యిచ్చేవాడు. ఫిబ్రవరి నుండి పాఠశాలతోపాటు ప్రత్యేకంగా రాత్రుళ్ళు కోచింగ్‌లు నిర్వహించేవారు. ఎనిమిదవ తరగతిలోనే 10వ తరగతి పరీక్ష ఫీజు కట్టించి రాయించేవాడు. తద్వారా మొదటిసారి కొందరు, రెండవసారికి మిగితావారు ఉత్తీర్ణులయ్యేవారు. ఇలా విద్యారంగంలో కొన్ని ప్రయోగాలు చేసి చూపారు.

అయితే విద్యపట్ల ఎంతో గౌరవం ఉన్న రాందాస్‌ చిన్నప్పుడు ఆటకోయిల పిల్లవాడిలా ఉంటూ, బడికి సరిగా వెల్లేవాడు కాదు. స్కూల్లో అతనికి అమాస్యపున్నమి అని ఎద్దేవా చేసేవారు. ప్రేమ్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాథమిక విద్య పూర్తి చేసి, ఖైరతాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1962లో హెచ్‌ఎస్సీ ఉత్తీర్ణులయ్యారు. 1967లో ఇంటర్మీడియట్‌ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, భోపాల్‌లలో నందలాల్‌ బండారీ ఇంటర్మీడియట్‌ కాలేజీలో చదివారు.

1970లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో బి.ఎ. చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎల్‌.ఎల్‌.ఎమ్‌. పూర్తి చేశారు. 1974 నుండి ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్‌.ఎ. పొలిటికల్‌ సైన్స్‌, ఎమ్‌.బి.ఎ. పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చేశారు. బాల కార్మికుడిగా పని చేసుకుంటూ, ఈ చదువులు చదువుకున్నారు. పదేళ్ళ వయస్సులో బాల కార్మికుడిగా సెంట్రింగ్‌ పని చేశాడు. హైదరాబాద్‌ ఆల్విన్‌, ఆజ్‌బెస్టాస్‌, ఐల్యాంప్‌, మినికామ్‌, ఇండియా లీప్‌ కంపెనీ, ఫర్నీచర్‌ మిల్‌, ఐ.డి.ఎల్‌. కెమికల్‌ ఫ్యాక్టరీ తదితర సంస్థల్లో పని చేశారు.

ఎల్‌.ఎల్‌.ఎమ్‌.లో ట్రేడ్‌ యూనియన్‌ మూమెంట్‌ ఇన్‌ ఇండియా అనే సెమినార్‌ సమర్పించారు. ఎం.బి.ఎ.లో ఇంప్రూవ్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొడక్టివిటీ ఇన్‌ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ అంశంపై ప్రాజెక్టు వర్కు చేసి సమర్పించారు.

1962 నుండి వివిధ కార్మిక సంఘాల్లో వామపక్ష భావజాలంతో చురుకుగా పనిచేసేవారు. ముఖ్యంగా ఐ.డి.ఎల్‌. ఫ్యాక్టరీలో ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసుకుంటూ విద్యను కొనసాగించారు. వామపక్ష భావజాలంతో స్ఫూర్తి పొంది పనిచేయడానికి కామ్రేడ్‌ ఎం.కె. స్వామి, కామ్రేడ్‌ లక్ష్మీదాస్‌ ఎంపిల ప్రభావం కారణం. 1962లో ఇండియా చైనా యుద్ధం తర్వాత కమ్యూనిస్టులు చైనాను సమర్థించడంతో కలతచెంది, కమ్యూనిస్టులతో అంటీముట్టనట్లుగా దూరం జరిగారు. 1965లో రామమనోహర్‌ లోహియా నాయకత్వంలోని సంయుక్త సోషలిస్టు పార్టీ ఉద్యమంలోకి ఆకర్షించబడ్డాడు. బద్రీ విశాల్‌ పిట్టి, ప్రముఖ చిత్రకారుడు ఎమ్‌.ఎఫ్‌ హుస్సేన్‌, సోషలిస్టు పార్టీ ద్వారా పరిచయమయ్యారు.

రాందాస్‌కు అంబేడ్కరిజం 1965లో పరిచయంలోకి వచ్చింది. ధనుంజయకీర్‌ రాసిన అంబేడ్కర్‌ జీవిత చరిత్ర చదివి రాందాస్‌ బాగా ప్రభావితుడయ్యాడు. అదే సమయంలో భగవాన్‌ దాస్‌ రాసిన 'దస్‌ స్పోక్‌ అంబేడ్కర్‌' పుస్తకాలు రాందాస్‌ను లోహియా వాదంనుండి బుద్ధిజంలోకి, అంబేడ్కరిజంలోకి మలుపుతిరగడానికి కారణమయ్యాయి. లోహియా సోషలిస్టులు చెప్పే సోషలిజం పట్ల విశ్వాసం సడలిపోయింది. అంబేడ్కరిజం ద్వారానే భారతీయ ప్రజలకు ఏదైనా చేయాల్సి ఉంటుందని గట్టిగా భావించారు. అయినా సోషలిస్టులతో కలిసి పనిచేస్తూ, ఉద్యమిస్తూనే ఆ స్నేహాలను కాపాడుకుంటూ వచ్చారు. అలా అంబేడ్కరిజం, నవయాన బుద్ధిజం, లోహియావాదంను సంశ్లేషించుకొని తన జీవితాన్ని కార్యక్షేత్రాన్ని విస్తరింపజేసుకున్నారు.

1967లో ఐ.డి.ఎల్‌. కెమికల్‌ ఫ్యాక్టరీలో పనిచేసే 3,500 కార్మికులు రాందాస్‌గారిని ట్రేడ్‌ యూనియన్‌కు ప్రధానకార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ కాలంలో కనీస వేతనాల కోసం, ఉద్యోగ భద్రత కోసం రాందాస్‌ అనేక ఉద్యమాలను నడిపారు. 60 రోజులపాటు పెద్దఎత్తున సమ్మెను నడిపారు. ఆ సమ్మె జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ జార్జ్‌ ఫెర్నాండేజ్‌, ప్రెసిడెంట్‌ బద్రి విశాల్‌ పిట్టి, వైస్‌ ప్రెసిడెంట్‌ నాయిని నర్సింహారెడ్డి, జనరల్‌ సెక్రటరీ కె.ఎన్‌. రామదాస్‌ నాయకత్వంలో సాగింది. అది కార్మిక ఉద్యమాలపై బలమైన ప్రభావం వేసింది. అప్పుడు పోలీసుల కాల్పులు, లాఠీచార్జీలు జరిగేవి. వాటిపై ఎంక్వైరీ కమిటీ వేసి, పోలీసులదే తప్పని తేల్చారు.

అలా ఉద్యమాల ద్వారా 350 రూపాయల నుండి 2,500 వరకు జీతాలు పెంచుకున్నారు. 1967-70ల మధ్య చేసిన ఉద్యమాలలో క్యాంటిన్‌ సౌకర్యం మరొక ముఖ్యాంశం. 10 పైసలకు బ్రేక్‌ఫాస్ట్‌, 35 పైసలకు లంచ్‌, క్యాంటిన్‌లో లభించాలని, యాజమాన్యం సబ్సిడీపై సప్లై చేయాలని పోరాటం చేసి సాధించారు. ఒక్క రూపాయికి మూడు రోజుల భోజనం లభించేది. ఇవే రేట్లు ఇప్పటికీ కొనసాగడం విశేషం.

1962 దాకా రాందాస్‌ జీవితం ఒక థ అని చెప్పవచ్చు. ఆ సమయంలో అతని స్నేహబృందం విస్తారంగా ఉండేది. ప్రహ్లాద్‌, వీరేష్‌, గజ్జె నర్సింహ, బాల నర్సింహ, అంగద కుమార్‌, శ్యాంరావ్‌, కృష్ణస్వామి, నామ్‌దేవ్‌, రాంరెడ్డి తదితరులు సన్నిహిత సహచరులు. వీరిలో తర్వాతి కాలంలో కొందరు మింట్‌ కాంపౌండ్‌లో, కొందరు సెంట్రింగ్‌ వర్కర్లుగా, కొందరు మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా, కొంతమంది అసిస్టెంట్‌ పోలీసు కమీషనర్లుగా పనిచేశారు.

1967నుండి రాందాస్‌ జీవితం మరో థలోకి ప్రవేశించింది. ఆ కాలంలో మాజీ మంత్రి పి. శంకర్‌రావు, పిసిసి మాజీ అధ్యకక్షుడు డి. శ్రీనివాస్‌, పార్లమెంట్‌ సభ్యులు మాధవరెడ్డి, ముధులిమయే, పార్లమెంట్‌ సభ్యులు ఐ. చక్రధర్‌, టి.ఎన్‌. సదాలక్ష్మి ఎమ్మెల్యే, రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర అధ్యకక్షురాలు జె. గీతారెడ్డి తల్లియైన జె. ఈశ్వరీబాయి, కేశవరావ్‌ జాదవ్‌, బద్రి విశాల్‌ పిట్టి, జార్జి ఫెర్నాండేజ్‌, నాయిని నర్సింహారెడ్డి తదితరుల సహచర్యంలో అనేక ఉద్యమాలను నిర్మించారు. ఒకవైపు విద్యార్థిగా, కాలేజికి వెళ్తూ, మరొకవైపు కార్మికుడిగా పనిచేస్తూ, ఇంకొక వైపు కార్మిక నాయకుడిగా అనేక కోణాల్లో ఏకకాలంలో జీవించారు. అన్ని కర్తవ్యాలను నెరవేర్చారు.

కె. ఎన్‌. రాందాస్‌ 1969 నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ క్రమంలో మరెందరో స్నేహబృందంలో ఉద్యమ క్రమంలో సన్నిహితు లయ్యారు. బౌద్ధం పట్ల మొదట్నుంచి ఆకర్షితులైన రాందాస్‌ జీవితంలో బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుకున్నాడు. అందువల్ల దేనికీ జంకేవాడు కాదు. కండలు తిరిగిన యువకుడిగా అనేక పోట్లాటల్లో ముందుండి నడిపించేవాడు. రాందాస్‌ చిన్నప్పటినుండి భీమసేనుడిలా బలిష్ఠమైన శరీరం. చివరి సంతానం కావడంతో రాందాస్‌ 10వ ఏట సైకిల్‌ కైంచి తొక్కుతూ కూడా అమ్మదగ్గర పాలుతాగుతుండేవాడు. రోలుమీద నిలబడి అమ్మను పిలిచేవాడు. రాకపోతే రాయి యిసిరేవాడు. అలా అమ్మరాగానే పాలుతాగేవాడు. అలా పది పదకొండేళ్ళ దాక పాలుతాగి పెరిగాడు.

1970 తర్వాత అనేక ఉద్యోగాలు చేశాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో, కేంద్ర ప్రభుత్వ ప్రావిడెంట్‌ ఫండ్‌ కార్యాలయంలో యుడిసిగా, రిజర్వ్‌ బ్యాంక్‌లో కాయిన్స్‌, నోట్స్‌ ఎగ్జామినర్‌గా, సిబిఐలో అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌గా, చివరగా ఆంధ్రప్రదేశ్‌ చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి శాఖలో (ఎపిఎస్‌ఐడిసి) డిప్యూటి మేనేజర్‌గా, లా కంపెనీ సెక్రటరీగా పనిచేసి 1999లో స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్నారు. ఇలా అనేక రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ, ఉద్యమాలు, డిగ్రీలు, స్నేహాలే లోకంగా బతుకుతూ ఎప్పటికప్పుడు ఉద్యోగాలు మార్చడం వల్ల పెన్షన్‌ లేకుండా పోయింది.
కాలేజీ, యూనివర్శిటీలలో చదువుతున్న కాలంలో మల్లేష్‌, బి. రామస్వామి, సర్వయ్య, పద్మారావు, యాదయ్య, హంసకుమార్‌ జైశ్వాల్‌, బాబూరావు, గోపాల్‌సింగ్‌ (జడ్జి), ఎం. మాధవరెడ్డి (ఎం.పి.), పి. జనార్ధన్‌రెడ్డి (ఎమ్మెల్యే), లక్ష్మీదాస్‌ (ఎం.పి), ఎం.కె. స్వామి, రావెల సోమయ్య, సురమౌళి, గోపాల్‌రావు (ఎమ్మెల్యే), బి.సత్యనారాయణ రెడ్డి (గవర్నర్‌), పొలసాని నర్సింగరావు (ఆర్‌.టి.సి. ఛైర్మన్‌), ఎం. సత్యనారాయణరావు (ఎం.పి.) కేశవరావు జాదవ్‌, కె. కేశవరావు తదితరుల సాంగత్యం లభించింది.

జై తెలంగాణ ఉద్యమంలో బద్రి విశాల్‌ పిట్టితోపాటు, నాగం కృష్ణ, మదన్‌మోహన్‌, నాయిని నర్సింహారెడ్డి, పి.జె. సూరి, నారాయణదాసు, సిహెచ్‌. బాలకృష్ణ, కొండాలక్ష్మణ్‌ బాపూజీ, జె. ఈశ్వరీబాయి తదితరులతో కలిసి ఉద్యమించారు. ఉద్యమంలో భాగంగా బంద్‌లు, సమ్మెలు, బస్సుల పై రాళ్ళు, పోలీసులపై దాడి, కళ్ళల్లో కారంపొడి కొట్టడం, మొదలైన ఎన్నో రూపాల్లో ఉద్యమాలను సాగించారు.

1970లో కె.ఎన్‌. రామదాస్‌ ఎస్సీ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీలో చేరారు. దీన్ని లేబర్‌ ఆఫీసర్‌ బాలకృష్ణ 1970లో స్థాపించారు. ఇందులో సలహాదారుగా ఉంటూ, పదవులు తీసుకోకూడదనే నియమంతో చాలాకాలంపాటు పనిచేశారు. అంబేడ్కర్‌ స్థాపించిన బుద్ధిస్టు సొసైటి ఆఫ్‌ ఇండియాలో 1970 నుండి సభ్యుడయ్యాడు. అంతే గాకుండా 1965ల నుండి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న సూర్యనారాయణ మిత్రుడి ద్వారా నాస్తిక గోరా, పెరియార్‌ ఇవి రామస్వామి నాయకర్‌ తదితరుల నాస్తిక, హేతువాద భావాలతో ప్రభావితులయ్యారు. మద్రాసు వెళ్ళి పెరియార్‌ను కలిసి స్ఫూర్తి పొందారు.

కె.ఎన్‌. రాందాస్‌ తన జీవితంలోకి అంబేడ్కరిజం ఎలా ప్రవేశించిందో చూస్తే ఎంతో ఆసక్తి కలుగుతుంది. అడ్వకేట్‌గా, ఆర్గనైజర్‌గా, ఎన్నో ఉద్యమాల్లో పనిచేస్తూ ముందుకు సాగిన క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక కేసు మరింత ఆసక్తికరమైనది.

తూర్పు గోదావరి జిల్లా కొత్తూరులో వ్యవసాయ కూలీలు సంఘం పెట్టుకున్నారు. వారు కనీస కూలీలలకోసం, హక్కులకోసం, ఉద్యమించే క్రమంలో దళితుడు హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగా దళితులు ఒక కాపును చంపారు. ఈ కేసు హైకోర్టుకు వచ్చింది. అప్పటి హైకోర్టు జడ్జి జస్టిస్‌ పున్నయ్య తానుకూడా దళితుడినేనని కనుక ఈ కేసు విచారించలేనని వేరే వారికి బదిలీ చేశారు.

ఆ జడ్జి కాపు అయినప్పటికీ ఆ కేసును టేకప్‌ చేసి, యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. తనకు యావజ్జీవ కారాగార శిక్ష వద్దని, ఉరిశిక్ష విధించాలని... కోరారు. అయితే అందుకు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోమని తీర్పు ఇచ్చారు. బిర్లా అడ్వకేట్‌ ద్వారా బెయిల్‌ తీసుకోవడం, కేసు వాదించడం జరిగింది. కేసుకు సాక్ష్యాలే లేవని కొట్టివేశారు. శిక్షను రద్దుచేశారు. కె.ఎన్‌. రాందాస్‌ ఆ తర్వాత ఆనిందితుడికి ఆర్‌డిఓ సందర్శన ద్వారా రేషన్‌ షాపు డీలర్‌షిప్‌ ఇప్పించారు.

ఆ కేసు సందర్భంగా ఢిల్లీలో ప్రముఖ అంబేడ్కరైట్‌, అర్థశాస్త్రవేత్త ఆర్‌. సంగీతరావు సన్నిహితమయ్యారు. అలా కె.ఎన్‌. రాందాస్‌కు అంబేడ్కరిజం 1965లో పరిచయంలోకి వచ్చింది. ధనుంజయకీర్‌ రాసిన అంబేడ్కర్‌ జీవిత చరిత్ర చదివి రాందాస్‌ బాగా ప్రభావితుడయ్యాడు. అదే సమయంలో భగవాన్‌ దాస్‌ రాసిన 'దస్‌ స్పోక్‌ అంబేడ్కర్‌' పుస్తకాలు రాందాస్‌ను లోహియా వాదంనుండి బుద్ధిజంలోకి, అంబేడ్కరిజంలోకి మలుపుతిరగడానికి కారణమయ్యాయి. లోహియా సోషలిస్టులు చెప్పే సోషలిజం పట్ల విశ్వాసం సడలిపోయింది. అంబేడ్కరిజం ద్వారానే భారతీయ ప్రజలకు ఏదైనా చేయాల్సి ఉంటుందని గట్టిగా భావించారు. అయినా సోషలిస్టులతో కలిసి పనిచేస్తూ, ఉద్యమిస్తూనే ఆ స్నేహాలను కాపాడుకుంటూ వచ్చారు. అలా అంబేడ్కరిజం, నవయాన బుద్ధిజం, లోహియావాదంను సంశ్లేషించుకొని తన జీవితాన్ని కార్యక్షేత్రాన్ని విస్తరింపజేసుకున్నారు.
రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటి తరఫున ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టాంక్‌బండ్‌ కింద అంబేడ్కర్‌ భవన్‌ నిర్మాణం కోసం ఉద్యమం చేస్తూ, ముప్పై రోజులపాటు రీలే నిరహారదీక్షను నిర్వహించారు.

మిత్రుడు రావెల సోమయ్య సూచనతో రాందాస్‌ మధురమయ్యే సాంఘిక విప్లవకారుడు అంబేడ్కర్‌ అని రాసిన వ్యాసాన్ని తెలుగులో సురమౌళి చేత అనువదింపజేసి ప్రచురించాడు. లోహియా జీవితం - చింతన అనే గ్రంథాన్ని తుర్లపాటి సత్యనారాయణ చేత పూర్తి చేయించి ప్రచురింపజేశారు. ఇంకా మరెన్నో గ్రంథాలను ప్రచురించాలని ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాల ఒత్తిడిలో పుస్తక ప్రచురణ ముందుకు సాగలేదు.

రాందాస్‌కు పర్యటనలన్నా, ప్రయాణాలన్నా చాలా ఇష్టం. అలా దేశమంతా పర్యటించారు. బొంబాయి, మద్రాసు, ఢిల్లీ, కలకత్తా, జమ్మూకాశ్మీర్‌, పాట్నా, గయ, ముజఫర్‌పూర్‌, భువనేశ్వర్‌, కటక్‌, బరంపురం, భూపాల్‌, నాగ్‌పూర్‌, ఇండోర్‌ తదితర నగరాలను చుట్టివచ్చారు.

తల్లి కొండ లచ్చమ్మ రాందాస్‌ గురించి నిరంతరం బాధపడుతుండేది. కొడుకు పెళ్ళి చేసుకోకుండా ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నాడు. తిండితిప్పలు, నిద్ర లేకుండా పోతున్నది. పెళ్ళి చేసుకోమంటే వద్దంటున్నాడని ఎప్పుడూ బాధపడుతుండేది, కన్నీళ్ళు పెడుతుండేది. రాందాస్‌కు అమ్మంటే మహాప్రేమ. అమ్మ బాగా దుఃఖించడం చూసి చివరకు అమ్మకోసం పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చాడు. అలా రాందాసు వివాహం 1985 అక్టోబర్‌లో బొంబాయి వాసులైన చంద్రకళ కూతురైన పుష్పతో నాగ్‌పూర్‌లో విజయథమి దీక్షాభూమిలో బుద్ధిష్టు మాంక్‌ ద్వారా జరిగింది.

పుష్ప తండ్రి అమెరికన్‌ ఇన్‌ఫర్మేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. రాందాస్‌ అక్క సక్కుబాయి బొంబాయిలో 30 ఏళ్ళు ఉండింది. ఆ క్రమంలో అక్కదగ్గరికి రాందాస్‌ అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. అక్క పక్కింట్లో చంద్రకళ కుటుంబం ఉండేది. అక్క సక్కుబాయి, చంద్రకళ మంచి స్నేహితులు. చంద్రకళ కూతుర్ని తమ తమ్ముడికి ఇమ్మని పదే పదే అడిగేది. అలా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పుష్పను రాందాస్‌కు ఇచ్చి పెళ్ళి చేయడానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి.

వారికి తొలి సంతానం సమత, తర్వాత సాగర్‌ జన్మించారు. సమత ప్రస్తుతం ఎంటెక్‌ చేస్తున్నది. సాగర్‌ బిటెక్‌ పూర్తి చేసి, ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులకు సిద్ధమవుతున్నాడు.
రాందాస్‌ చిన్నప్పటినుండి శాఖాహారి. అయినప్పటికీ 1972లో నాస్తిక గోరా హైదరాబాద్‌లో పందిమాంసం, గొడ్డుమాంసం సహపంక్తి భోజనాలు కార్యక్రమం తీసుకున్నప్పుడు చురుకుగా పాల్గొన్నాడు. అయితే హిందూమహాసభ, ఆర్‌.ఎస్‌.ఎస్‌. వాళ్ళు దాన్ని చెదరగొట్టారు. అన్నంలో, కూరల్లో మట్టి పోశారు. అక్కడ్నుంచి జాగ్రత్తగా తప్పుకున్నాడు రాందాస్‌. రాందాస్‌ ఇండియన్‌ రేషనలిస్ట్‌ మాసపత్రిక లైఫ్‌ మెంబర్‌గా చేరారు.

1985 జులైలో జరిగిన కారంచేడు సంఘటనపై వెంటనే స్పందించి, ఎస్సీ కాన్ఫిడరేషన్‌ ఏర్పాటు చేసి, ఇందిరా ప్రియదర్శిని హాలులో మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కారంచెడు సంఘటనపై ఉదయం దిన పత్రిక దళితుల పక్షాన బలంగా నిలబడింది. అందుకు కారకుడైన సంపాదకుడు ఎ.బి.కె. ప్రసాద్‌ను ఈ సభకు ముఖ్యఅతిథిగా పిలిచారు. అదేరాత్రి కారంచెడు వెళ్ళి బాధితులను పరామర్శించారు. ఆ క్రమంలో శెట్టి కన్నమరాజ (ఆర్‌.పి.ఐ.), కత్తి పద్మారావు, తదితరులు కలిసి పోలీసు ఐజి రామస్వామిని కలిసి రిప్రజెంట్‌ చేశారు. బాధితుల ఇంటర్వ్యూలను తీసుకొని కరపత్రాలుగా పత్రికా ప్రకటనలుగా ప్రచురించారు. 15 ఆగష్టును బ్లాక్‌డేగా ప్రకటించినప్పుడు జరిగిన లాఠీచార్జిలో సురమౌళి తీవ్రంగా లాఠీదెబ్బలు తిన్నారు.

రాందాస్‌ విద్యపట్ల, అక్షరంపట్ల ఎంతో ప్రేమను పెంచుకున్నప్పటికీ చరిత్రను, అనుభవాలను, సంఘటనలను రికార్డు చేయడంలో అశ్రద్ధ చేశారు. అందువల్ల ఆయన ఇల్లు ఒక గ్రంథాలయంలాగా వేలాది గ్రంథాలు ఉన్నప్పటికీ తన సామాజిక కృషిని భద్రపరిచే సాహిత్యాన్ని సేకరించి పెట్టలేకపోయారు. అందువల్ల ఈ కాస్త వివరాలు సేకరించడానికి ఎన్నో చర్చలు, జ్ఞాపకాలు, కలబోసుకోవాల్సి వచ్చింది. మన చరిత్ర మనమే రాసుకోవాలి అని రాందాస్‌ జీవితం మనకు మరోసారి గుర్తు చేస్తున్నది.

- బియస్ రాములు

English summary
A prominent writer in Telugu BS Ramulu writing on Ambedkarism in Nizam Gyderabad state, specially mentioned about the contribution of KN Ramadas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X