క్విక్ బాక్సింగ్: అల్లా ఉద్దీన్ ఆర్డినరీ ల్యాంప్
ఇది కథ కాదు నిజం. నిజాన్ని నిజమని నమ్మించడం ఎలాగో తెలీదు నిజంగా. నిజమా లేక కలా అని అడగొద్దు. కలలాంటి నిజమో, నిజమే కలో తెలవని స్థితి. అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ పరిస్థితి.
మాదో తాతలు కట్టిన పాత ఇల్లు. తాతలు కట్టిన అంటే కట్టించిందని. ఆ మాత్రం ‘షాడో' వుంది కనక బ్రతికి చస్తున్నాం సారీ చావకుండా బ్రతికున్నాం. గోడల్లోంచి ఇటుకలు తొంగిచూడ్డం చూరులోంచి నీళ్లు జారీ పడ్డం, తీగల్లోంచి కరెంటు చిట్ పట్ మండం మామూలే. వంటింట్లో ఓ అటుక (చెక్క సజ్జ) దాని మీద పాత సందూకులు (చెక్క పెట్టెలు) పడివున్నాయి. ఎన్నేళ్లనించో. ముసలి కొంపకి యవ్వనం వచ్చేట్టు చేసి క్యాట్ వాకింగ్ కీ మోడలింగ్ కీ పంపలేం కనుకే వున్నదుమ్మునీ ధూళినీ బూజునీ అయినా దులిపి గూళ్లలో సెటిలయిన సాలీళ్లకి గృహ బహిష్కరణ శిక్ష వేద్దామని నిర్ణయించుకున్నా ఓ రోజు.

అటకెక్కి పాత చెక్క పెట్టులు తీసి బయట పడేశా ముట్టుకుంటే పట్టుకుంటే విరిగేవి విరిగేయి ఫట్టుమనేయి ఆ పని చేసేయి. అయితే ఒక చిన్న చెక్క పెట్టె మాత్రం యింకా ‘సిక్స్ పేక్' బాడీతో వుంటంతో నా ‘క్యూరియాసిటీ' పెరిగింది. ఇందులో బంగారమో, వజ్ర వైఢుర్యాలో మరకత మాణిక్యాలో వుండివుంటే ఇన్నాళ్లూ అనవసరంగా ‘పూర్ లైఫ్' గడిపానే అని బాధ పడవలసి వస్తుందనుకుంటూనే దానికివున్న చిన్న తాళం మెడ విరిచా స్క్రూ డ్రైవర్‌తో. ఓడిపోయాన్రోయ్ అని అరుస్తూ నోరు వెళ్ల బెట్టింది పెట్టె. లోపల్కి ‘హరీ బరీ'గా తొంగి చూద్దును కదా ఓ పాత కాలపు ‘ఎక్కా బుడ్డీ' చిన్నదీ బుజ్జిదీ అయిన ఇనుప దీపానికి నల్లటి ముఖంతో వున్న గాజు బుడ్డీ. ఇంత జాగర్తగా వుంచిన ఈ దీపం ఆర్డినరీ దీపం అయివుంటానికి వీళ్లేదు ససేమిరా. మరేమయి వుంటుంది?!
ఆలోచిస్తుంటే మెడుల్లా ఆబ్లాంగెటా నుంచి వొణుకు స్పైనల్ కార్డులోకి జర్రుమంది. యస్! యస్! అదే! అంతే!
ఇది అరేబియా కథలోంచి వచ్చిన ఆ ల్యాంపే! ఆ అద్భుతమైన ల్యాంపే! నోడవుట్! సందేహం లేదు. మా ముత్తాతో ఆ ముత్తాత తాతో యిది నాకోసం సేఫ్‌గా దాచివుంచాడన్న మాట. ఇప్పుడిది నాకు చిక్కింది ఏడు కొండల వెంకన్నా ఇప్పుడేం చెయ్యాలన్నా!
ముందు దీనితో ఏం చెయ్యాలో ‘డిసైడ్' చేసుకోవాలి. ఆ తర్వాతే బుడ్డీని శుబ్బరంగా తోమెయ్యాలి. బుడ్డి తళతళలాడిందా భూతం బయటికి వస్తుంది. వాడి జెయింట్ ఆకారానికి ఈ పాత కొంప కుప్పకూలుద్దేమో! బయట గ్రౌండులో అయితే బెటర్ కానీ మీడియా వాళ్లూరుకోరు. ఇక్కడే తంటాలు పడాలి. కొంపకూలితే ఫలన్‌నుమా ప్యాలెస్ కట్టించుకుందాం. ఛ.. పాత కాలంలో ఎవడూ అడగలేదు కానీ ఇంకంటాక్సోడు ‘టై' వూపుకుంటూ రాడూ! మున్సిపాలిటీ వాడూరుకోడు. ఏం లాభం! ఉన్నట్టుండి చెమట్లు పట్టాయో, పోశాయో మొత్తానికి తడిసిపోయా! ఏది అడిగినా ఏది తీసుకున్నా ఏదో ఓ ప్రాబ్లమ్ వచ్చి పడుతుంది. ఈ కాలంలో అద్భుత దీపం వున్నా దీపాన్ని తోమితే ‘జో హుకుం ఆకా' అనే భూతం వచ్చి పడ్డా ఏమి తీసుకోను వీలు పడదుగాక పడదు. కారయితే కాయితాలెవడిస్తాడు? ఇల్లయితే ల్యాండెవడిస్తాడు? గోల్డయితే కస్టమోడితో కష్టం యింకేదన్న అయితే గవర్నమెంటోడు చావగొట్టేస్తాడు.
గవర్నమెంటునుకోగానే అయిడియా వచ్చింది. దీన్ని వాడికేయిచ్చేసి అంతో ఇంతో అడుక్కుని జీవితాన్ని మార్చేసుకుంటే సరి అనిపించింది. ఈ దీపాన్ని చిదంబరానికిచ్చేస్తే ఆయన తొమ్మిది బడ్జెట్లలోనూ దీన్నే కదా చూపాడు. ఆయనే కాదు ఏ బడ్జెటోడయినా తన ‘బ్రీఫ్ కేస్'లో దీన్నే కదా పట్టుకొస్తాడు. పోనీ ‘ఆకా'ని పిల్చి ఓ ‘సత్య పీఠం' యిమ్మాందం. అది రాజకీయ నాయకుల అసలు రంగు తేలుస్తుంది. ఈ ఆలోచన బానేవుందని పించింది కానీ వాళ్ల అబద్ధాలతోటే దేశం అట్టుడుకుతుంటే.. యిక వాళ్లు చెప్పే నిజాలు నేరాలు.. ఘోరాలు! దేశం అల్లకల్లోలమే. వాళ్లు చెప్పే అబద్ధాలు లేకపోతే బతుకు భారం, జీవితం ‘హోప్ లెస్' అవుతుంది. నలభయేళ్ల నా సినీ వ్యాపార రాజకీయ జీవితంలో నేను నమ్మాను మీరు నమ్మండి అంటాడొకాయన అట్లా నమ్మకం మీద బతుకీడ్చే వాళ్లెందరో! వాళ్లకి నష్టం చెయ్యద్దనుకున్నా. పోనీ మన సైంటిస్టులున్నారు గదా వాళ్లకి అందచేస్తే? ప్రపంచం మొత్తాన్ని ‘పొల్యూట్' చేసిపారేశారు చాలదూ మనుషుల్ని చంపే మారణాయుధాలు చాలవూ అని లోపల్నించి ఎవడో కేకేశాడు. ఎవడ్రా? అంటే ‘నా పేరు ఆత్మారాముడోయ్' అన్నాడువాడు. ఇంకా చాలా చాలా ఆలోచన్లు వచ్చేయి కానీ ఎవరికిచ్చినా ఖచ్చితంగా ‘మిస్' యూజవుతుందనిపించింది.
పెద్ద మెదడు, చిన్న మెదడు ఫ్రెండ్షిప్‌తో మరో మంచి ‘థాట్' వచ్చింది. వచ్చేది ఎలాగూ ‘సమ్మరే' కదా. కరెంటు కోత గ్యారంటీ కదా. రోజుకి ఇరవై గంటలు చీకట్లోవుంటం కంటే ఈ పాత బుడ్డిదీపం వెలిగించుకుని ఆ వెలుతుర్లో జీవితం సఫలం చేసుకోవచ్చు గదా అనిపించింది. కానీ బుడ్డిని తొమితే ‘ఆకా' అంటూ అరబ్బీభూతం గాడు వస్తాడేమోనని భయం వేసింది. వాడు రాకుండా వుంటేయిది అద్భుత దీపం అవకుండా వుంటేనే ‘నయ'మనిపించింది. డోంట్ ఫియర్! ‘మన కంతలేదు' గురూ అన్నాడు ఆత్మారాముడు కర్టెన్ లోపల్నించి.
- చింతపట్ల సుదర్శన్












Click it and Unblock the Notifications