వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిన పత్రికల 'వార్'

By రవికిరణ్
|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో తెలుగు దినపత్రికలు రాజకీయాల గొడుగులుగా మారాయి. నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలవాల్సిన పత్రికలు ఇప్పుడు రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి. పత్రికలకు పాలసీలు ఉండడం కొత్తేమీ కాదు. యాజమాన్యాల విధానాలకు అనుగుణంగానే పత్రికల పాలసీలు ఉంటాయి. బహుశా అది కొత్త విషయమేమీ కాదు. కానీ యాజమాన్యాల విధానాలు ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలనేది అందరూ కోరుకునేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు పత్రికలు ఏదో మేరకు ప్రజల పక్షాన నిలబడుతూ వచ్చాయి. ఆ తర్వాతే పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు కూడా కాంగ్రెసుకు అనుకూలంగా ఉన్న పత్రికలు ఉన్నాయి గానీ బాహాటంగా రాజకీయాలను నెత్తికెత్తుకోలేదు. ఇప్పటంత బహిరంగంగా అప్పుడు పత్రికలు పార్టీలకు కొమ్ము కాయలేదు.

తెలుగుదేశం పార్టీని సమర్థించే పనిని ఈనాడు 1983లో బాహాటంగానే చేపట్టింది. ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయానికి తగిన ప్రచారాన్ని ఆ పత్రిక కల్పించింది. కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వంటి పత్రికలు సమర్థంగా పని చేయడంలో విఫలమయ్యాయి. ఉదయం కూడా ఈ క్రమంలో విఫలమైంది. దీనికి యాజమాన్య లోపాలే కారణం. మూత పడి తెరిచిన తర్వాత ఆంధ్రజ్యోతి దిన పత్రిక కాంగ్రెసుకు వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోయింది. కాంగ్రెసుకు బలమైన పత్రిక లేకుండా పోయింది. ఈ విషయాన్ని గమనించే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుమారుడు సాక్షి దినపత్రికను ప్రారంభించారు. భారీగానే దాన్ని మొదలు పెట్టారు. ఈనాడుకు పోటీగా దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు.

పత్రికల వైపు, పత్రికా యాజమాన్యాల వైపు కన్నెత్తి చూడడానికి కూడా జంకుతూ వచ్చిన రాజకీయ నాయకులు పత్రికలపై దుమ్మెత్తి పోసే దాకా పరిస్థితి వచ్చింది. సాక్షి, ఈనాడు రెండు రాజకీయ పార్టీల యుద్ధంగా మారిపోయింది. ఈ పత్రికా యాజమాన్యాలు పరస్పరం ఇతర వ్యాపారాల్లోని అక్రమాలను బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. పత్రికా యుద్ధం, రాజకీయ యుద్ధం ఏక కాలంలో జరుగుతోంది. పత్రికలు తాము చేయాల్సిన పనిని మర్చిపోయి రాజకీయ యుద్ధంలో నిండా మునిగిపోయాయి. ప్రజా ప్రయోజనాలు గాలిలో కలసిపోయాయి. ఈ విషయం ప్రజలకు తెలియంది కాదు. కానీ, పత్రికలు, వాటిలో పని చేసే జర్నలిస్టులు కూడా ప్రజలకు గండంగా మారిన వైనాన్ని ఇప్పుడు చూస్తున్నాం. యాజమాన్యాల స్వలాభాపేక్ష, పత్రికల ద్వారా ఇతరేతర ప్రయోజానాలను నెరవేర్చుకునే తత్వం జర్నలిస్టులను కూడా పక్కదారులు పట్టించాయి. దీంతో పత్రికల్లో వృత్తి నైపుణ్యం గలవారికి చోటు లేని వాతావరణం వచ్చేసింది. పత్రికా కార్యాలయాలు రాజకీయ పార్టీల శిబిరాలుగా మారిపోయాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X