ముదురుతున్న గొడవ: ఎసిబి డైరెక్టర్ లీవ్

ACB Logo
మద్యం సిండికేట్ల వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ శ్రీనివాస రెడ్డి బదిలీ వ్యవహారం ముదురుతోంది. ప్రభుత్వానికి, ఎసిబికి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ ఒత్తిడితో ఎట్టకేలకు శ్రీనివాస రెడ్డి ఎసిబి నుంచి రిలీవ్ అయిన తర్వాత వివాదం మరింతగా రాజుకుంటోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒత్తిడి మేరకే ప్రభుత్వం శ్రీనివాస రెడ్డిని బదిలీ చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

శ్రీనివాసరెడ్డిని రాత్రికి రాత్రి బదిలీ చేయడాన్ని మొదట్లోనే ఎసిబి డైరెక్టర్ జనరల్ భూపతి బాబు వ్యతిరేకించలేదు. ఆయనను రిలీవ్ చేయడానికి నిరాకరించారు. దాంతో ఆయనను ప్రభుత్వం బలవంతంగా రిలీవ్ చేసింది. తన అభ్యంతరాలను లెక్క చేయకుండా శ్రీనివాస రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేయడాన్ని నిరసిస్తూ భూపతిబాబు దీర్షకాలిక సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు శనివారం వార్తలు వచ్చాయి.

మద్యం సిండికేట్లకు సంబంధించిన కేసు దర్యాప్తు కీలకదశలో ఉన్న సమయంలో సిట్ చీఫ్‌ను బదిలీ చేయడం తగదని, ఈనెల 16న హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో కనీసం అప్పటివరకైనా ఆయనను కొనసాగించాలని కోరుతూ భూబతిబాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, దానికి ప్రభుత్వం అంగీకరించలేదు. భూపతి బాబు లేఖను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదిని రంగంలోకి దించింది. అంతకుముందు డిజిపి దినేశ్‌రెడ్డి చెప్పినా భూపతి బాబు మెత్తబడలేదు. దీంతో ఆయనను ద్వివేది తన కార్యాలయానికి పిలిపించుకున్నారు.

శ్రీనివాస రెడ్డి స్థానంలో శివధర్‌రెడ్డి జాయిన్ అయ్యారని, అయినా మీరు శ్రీనివాసరెడ్డిని రిలీవ్ చేయలేదని, రూల్ పొజిషన్ ఏమిటో చెప్పాలని ద్వివేది భూపతి బాబును ప్రశ్నించారు. భూపతిరాజు చెప్పిన వివరణను ద్వివేది పట్టించుకోకుండా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. తక్షణమే శ్రీనివాస రెడ్డిని రిలీవ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. శ్రీనివాస రెడ్డి పనితీరును తప్పు పట్టి బదిలీ చేయడం లేదని, ప్రమోషన్ మీద బదిలీ చేసిందని ద్వివేది చెప్పినట్లు సమాచారం. రూల్ పొజిషన్‌ను అనుసరించకుండా లేఖ రాయడం దేనికి సంకేతమని ఆయన అడిగారని అంటున్నారు. ఇలాంటి స్థితిలో తాను పనిచేయలేనంటూ భూపతిబాబు దీర్షకాలిక సెలవు పెట్టినట్లు తెలుస్తోంది.

తాను దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు వచ్చిన వార్తలను భూపతిబాబు ఖండించారు. ఆయన శనివారం విధులకు హాజరయ్యారు.

నాపై ఒత్తిడి లేదు: సిఎం

శ్రీనివాసరెడ్డి బదిలీ విషయంలో తనపై ఏ ఒత్తిడీ లేదని తనను కలిసిన అఖిలపక్ష నేతలకు ముఖ్యమంత్రికిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయన బదిలీ సాధారణ పరిపాలనలో భాగంగానే జరిగిందని చెప్పారు. మద్యం సిండికేట్ల విషయంలో మంత్రుల ప్రమేయంపై రుజువులు లభిస్తున్న క్రమంలో దర్యాప్తును నీరుకార్చొద్దని, శ్రీనివాసరెడ్డి బదిలీని నిలుపుదల చేయాలని అఖిలపక్ష నేతలు ముఖ్యమంత్రిని కోరారు. శ్రీనివాసరెడ్డి స్థానంలో వస్తున్న అధికారి కూడా నిజాయితీపరుడేనని, దర్యాప్తు యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. శ్రీనివాసరెడ్డిని పదోన్నతిపైనే బదిలీ చేశామని, శ్రీనివాస రెడ్డిని ఇప్పుడున్న స్థానంలో కొనసాగించడం వీలుపడదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

రాజకీయ కుట్ర లేదు: శ్రీనివాసరెడ్డి

ప్రభుత్వ అధికారులకు బదిలీలు సర్వసాధారణమేనని ఎసిబి నుంచి రిలీవ్ అయిన శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేశానని ఆయన మీడియాతో అన్నారు. మద్యం కేసులకు సంబంధించి ఒక నివేదిక పూర్తి అయ్యిందని, మరో నివేదికను రూపొందిస్తున్నామన్నారు. 16వ తేదీలోగా హైకోర్టుకు అందజేస్తామన్నారు. ఇది క్లిష్టమైన కేసు కాబట్టి సాధారణ కేసుల్లా భావిస్తూ వెంటనే కొత్త బాధ్యతలు స్వీకరించలేమన్నారు.

సిట్‌లో ఇతర అధికారులకు ఈ కేసు గురించి వివరించాలని, అందుకే రిలీవ్ అవడానికి ఆలస్యం అయ్యిందని చెప్పారు. తన బదిలీ వెనుక రాజకీయ కుట్ర ఉందని తాను భావించట్లేదన్నారు. ఈ ఆరోపణలపై తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+