వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెగా మార్పు: దశ దిశ మార్చనున్న టెక్స్‌టైల్‌ పార్కు

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. ఇక కావాలసిందల్లా ప్రగతి బాట పట్టడమే. జిల్లాల ఆర్థికాభివృద్ధి, మనుగడను దృష్టిలో పెట్టుకొనే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో ప్రాజెక్టు ప్రకటించింది. ఇందులో భాగంగా వరంగల్‌ గ్రామీణ జిల్లాకు కేటాయించిన మెగా టెక్స్‌టైల్‌ పార్కు అటు గ్రామీణ జిల్లాకే కాదు.. దాంతోపాటు కొత్తగా ఆవిర్భవించిన మరో నాలుగు జిల్లాలపై ప్రభావం చూపనుంది.

ఈ ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర బిందువు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల్లో దీనికి చోటు కల్పించడం.. వేలాదిమందికి మెగా టెక్స్‌టైల్‌ పార్కుతో ఉపాధి కలుగుతుందని ముఖ్యమంత్రి కెసీఆర్‌ ఇటీవలి వరంగల్‌ పర్యటనలో ప్రకటించడం.. పార్కు కోసం భూసేకరణ శరవేగంగా సాగుతుండడంతో అందరి దృష్టి గ్రామీణ జిల్లాపై కేంద్రీకృతమయింది.

1200 ఎకరాల్లో:

మెగా టెక్స్‌టైల్‌ పార్కును తొలుత ధర్మసాగర్‌ మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామాల పరిధి గుట్టల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని కోసం 3000 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. ఈ గ్రామాల పరిధిలో తగినంత ప్రభుత్వ భూమి లభ్యం కాకపోవడం. సమీపంలోని స్థలాలన్నీ అటవీ భూమి కావడంతో భూసేకరణకు అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ప్రతిపాదిత పార్కు అర్బన్‌ జిల్లా నుంచి గ్రామీణ జిల్లా పరిధిలోని గీసుకొండ, సంగెం మండలాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైగా గ్రామీణ జిల్లాలో భారీ పరిశ్రమలేవీ లేవు.

ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండడం కలిసి వచ్చింది. జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోంది. గతంలో వరంగల్‌ శివారులోని అజంజాహీ మిల్స్‌ దేశంలోనే పెద్ద వస్త్ర పరిశ్రమగా విరాజిల్లింది. అప్పట్లో వేలాది మందికి ఇందులో ఉపాధి లభించేది. మిల్లును తీసేయడంతో జిల్లాలో పత్తి మిల్లులే తప్ప వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలు లేకుండా పోయాయి. దీంతో టెక్స్‌టైల్‌ పార్కును ఇక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాలా కలిసొస్తుందని భావించిన ప్రభుత్వం గీసుకొండ మండలంలోని శాయంపేట, సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామాల పరిధిలో 1200 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు 637 ఎకరాలకుపైగా భూమిని ప్రభుత్వానికి ఇవ్వడానికి రైతులు ముందుకొచ్చారు.

సోమ, మంగళవారాల్లో మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొత్తం 219 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు వివిధ గ్రామాల రైతుల నుంచి కొలుగోలు చేశారు. నవంబరు నెలాఖరుకల్లా మొత్తం 1200 ఎకరాల భూమి సేకరణ పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ.9లక్షలు: రైతుల నుంచి 123 జీవో కింద ప్రభుత్వం భూములను కొనుగోలు చేస్తోంది. పట్టాదారు రైతులకు దీని కింద ఎకరానికి రూ. 9.95 లక్షలు చెల్లిస్తున్నారు.

కాగా శాయంపేట గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఈ భూమిలో ప్రభుత్వ అసైన్డ్‌ భూమి కింద కొందరు రైతులు కాస్తులో ఉన్నారు. వీరికి కూడా ఎకరానికి రూ. 7.10 లక్షలు పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకుంటోంది ప్రభుత్వం. టెక్స్‌టైల్‌ పార్కు కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు నష్టం కలగకుండా భవిష్యత్తులో ఇక్కడొచ్చే పరిశ్రమల్లో ఉద్యోగ భరోసా కూడా ఇవ్వనున్నారు.

చింతపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న మరియాపూర్‌లో 40 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. టెక్స్‌టైల్‌ పార్కు కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ఇక్కడ ఇళ్లస్థలాలు కూడా కేటాయించనున్నారు. ఎకరానికి 100 గజాల స్థలం చొప్పన, అంతకన్నా తక్కువ భూమి ఇచ్చినవారికి 50 గజాల ఇంటిస్థలాన్ని ప్రభుత్వం కేటాయించనుంది.

 Mega textile park at Wrangal will be soon

మొత్తం మూడు చోట్ల:

టెక్స్‌టైల్‌ పార్కు కోసం గీసుకొండ, సంగెం మండలాల్లో మొత్తం మూడు చోట్ల స్థలాలను కేటాయించనున్నారు. ఒకే చోట 1200 ఎకరాలు లభ్యం కాని పరిస్థితి ఉన్నందున అందుబాటులో ఉన్న స్థలాలను సేకరించి మూడు చోట్ల పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రైతుల నుంచి భూసేకరణ జరిపి రెవెన్యూ అధికారులు ప్రతిపాదిత టెక్స్‌టైల్‌ పార్కు స్థలాన్ని టీఎస్‌ఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ)కు అప్పగించనున్నారు.

ఇప్పటికే టీఎస్‌ఐఐసీ కూడా ప్రతిపాదిత స్థలాన్ని సర్వే చేసింది. కొన్ని ప్రాంతాల్లో చెరువులు సమీపంలో ఉన్నందున వాటికి నష్టం వాటిల్లకుండా స్థలాలు సేకరించాలని టీఎస్‌ఐఐసీ సూచించింది. 1200 ఎకరాల భూసేకరణ పూర్తయితే టీఎస్‌ఐఐసీ టెక్స్‌టైల్‌ పార్కుపై 'డీపీఆర్‌' (డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు) రూపొందిస్తుంది. ఇప్పటికే 'ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌' కన్సల్టెంట్‌కి డీపీఆర్‌ రూపొందించే బాధ్యతను అప్పగించారు.

గతంలో ధర్మసాగర్‌ మండలంలో టెక్స్‌టైల్‌ పార్కు ప్రతిపాదించినపుడు ప్రభుత్వం మఫత్‌లాల్‌, రిలయన్స్‌లాంటి ప్రముఖ వస్త్ర కంపెనీలను ఇక్కడ తమ యూనిట్‌లు స్థాపించాలని ఆహ్వానించింది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆ మధ్య శ్రీలంక పర్యటనకు వెళ్లినపుడు అక్కడి కంపెనీలను కూడా తెలంగాణలో స్థాపించేందుకు వసతులు కల్పిస్తామని ఆహ్వానించారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటుచేసే టెక్స్‌టైల్‌ పార్కులో కూడా అనేక వస్త్ర కంపెనీలు తమ యూనిట్లు నెలకొల్పే అవకాశం ఉంది.

మెగాటెక్స్‌టైల్‌ పార్కు వస్తే పత్తిని శుద్ధి చేసే దగ్గరి నుంచి దారం, నాణ్యమైన వస్త్రాలు నేయడం, రెడీమెడ్‌ బట్టలు తయారుచేసే వరకు రకరకాల కంపెనీలు జిల్లాకు వస్తాయి. దీంతో జిల్లాలో పత్తిసాగు చేసే రైతాంగానికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ పార్కుతో దాదాపు 4వేల మందికి ప్రత్యక్షంగా, లక్షలాదిమందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది.

పారిశ్రామిక విధానం ప్రకారం రూ. కోటి పెట్టుబడికి 60 మందికి ఉద్యోగం కల్పించాల్సి ఉంటుంది. జిల్లాలో సాగయ్యే తెల్లబంగారం ఇక్కడే వివిధ దశల్లో యంత్రీకరణ జరిగి నాణ్యమైన వస్త్రంగా తయారై విదేశాలకు సైతం ఎగుమతి అయ్యే వీలుంది. ప్రస్తుతానికి 1200 ఎకరాల భూసేకరణ పూర్తిచేశాక టెక్స్‌టైల్‌ పార్కును మొదటి దశ కింద ఏర్పాటుచేస్తారు. ఈదశలో వివిధ కంపెనీలు ఆసక్తి చూపిస్తే భవిష్యత్తులో మరింత భూమిని సేకరించి మెగా టెక్స్‌టైల్‌ పార్కును 2200 ఎకరాలకు విస్తరించే అవకాశం ఉంది.

English summary
Land acquisition in progress to establish a mega textile park at Warangal of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X