జయ కామెంట్ చిరుపైనే!

తమిళనాడులోని అన్నాడియంకె, డిఎంకె పార్టీలకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్థానిక పునాదులున్నాయి. బ్రాహ్మణ వ్యతిరేక, ద్రావిడ ఉద్యమాల నేపథ్యం వాటికి ఉంది. తమిళనాడు మొదటి నుంచి తన సాంస్కృతిక అస్తిత్వం కోసం పోరాటం చేస్తూనే ఉన్నది. స్థానిక ప్రయోజనాలకు ఆ రాష్ట్రం ఇచ్చిన ప్రాధాన్యం బహుశా ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. సినిమా రంగానికి చెందినవారే అయినప్పటికి రామచంద్రన్, కరుణానిధిలకు రాజకీయ దృక్పథం ఉంది. సమాజం పట్ల అవగాహన ఉంది. ఉత్తర భారత రాజకీయాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలనే స్పృహ ఉంది. ఈ దృష్ట్యా వారు పూర్తి రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందారు. రామచంద్రన్ ఉన్నంత వరకు దాదాపుగా తెరమరుగునే ఉండిపోయిన జయలలిత అన్నాడియంకె పగ్గాలు చేతబట్టి తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. ఆమె కూడా పూర్తి రాజకీయ అవగాహనతో వ్యవహరిస్తున్నారు. వీరంతా దాదాపుగా సినిమాలకు సంబంధం లేనివారిగా కనిపించే స్థాయి వచ్చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోనూ స్వర్గీయ ఎన్టీ రామారావు స్పష్టమైన అవగాహనతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం ఆయనకు ప్రధాన అస్త్రంగా ఉపయోగపడింది. హస్తిన చేతిలో ఆంధ్రప్రదేశ్ నాయకులకు జరుగుతున్న అవమానాలు ఆయనకు యుద్ధ సామగ్రిగా పనికి వచ్చాయి. రామారావుకు కూడా త్రిపురనేని రామస్వామి చౌదరి చేపట్టిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ నేపథ్యం ఉంది. పౌరాణిక చిత్రాల్లో దుర్యోధనుడు, రావణాసురుడు వంటి ప్రతినాయకులను ప్రధానం చేయడం ఇందులో భాగమే. అలాగే, ప్రజలకు సంక్షేమ పథకాలను హామీ ఇస్తూ ఆయన ఎన్నికల్లో నెగ్గుకొచ్చారు. ఆయనకు ఇమేజ్ మాత్రమే ఉపయోగపడలేదు. ఆనాటి పరిస్థితులు ఆయనకు దోహదం చేశాయి.
చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తున్న సందర్భం అప్పటి సందర్భమంత స్పష్టంగా లేదు. సమాజంలోని భిన్న సామాజిక శ్రేణుల ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పార్టీలు ఇప్పటికే ఉన్నాయి. వాటిలో ప్రజలు ఇమిడిపోయి ఉన్నారు. అంటే, ఒక రకంగా రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదని చెప్పాలి. మరి, చిరంజీవి ఎలా నెట్టుకొస్తాడో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications
