'అన్న'కు 'అన్నయ్య' ధీటా?

ఇక, చిరంజీవి విషయానికి వస్తే, పునాదిరాళ్లు సినిమాతో ఆయన సినీ రంగంలో అడుగు పెట్టారు. అయితే ప్రాణం ఖరీదు సినిమా మొదట విడుదలైంది. ఎన్టీరామారావు, కృష్ణ వంటి మాస్ కథానాయకులు ఉండగానే సినీ రంగంలో కాలు పెట్టిన ఆయన మూడు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమను ఏలాడంటే అతిశయోక్తి కాదు. ఎన్టీ రామారావుతో కలిసి ఆయన తిరుగులేని మనిషి అనే సినిమాలో నటించారు. ఎన్టీ రామారావులాగా పౌరాణిక పాత్రలను ఆయన పూర్తి స్థాయిలో పోషించలేదు. శివుడి పాత్రను ఆయన పోషించి మెప్పించారు. ఇంకా కొన్ని పౌరాణిక పాత్రలను పోషించారు గానీ ఎన్టీఆర్ లాగా గుర్తింపు పొందలేదు. అయితే మొదట్లో చిరంజీవి విలన్ పాత్రలను కూడా పోషించి మెప్పించారు. ఆయన ప్రత్యేక శైలిని బాగా పట్టుకున్నవారు దర్శకుడు బాలచందర్ అనుకోవాలి. ఇది కథకాదు, 47 రోజులు సినిమాల్లో అతను యాంటీ హీరో పాత్రను పోషించారు. ఈ సినిమాల్లో చిరంజీవి ప్రత్యేకతను బాలచందర్ బాగా వాడుకున్నారు. కుక్క కాటుకు చెంపదెబ్బ వంటి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత హీరోగా మారి అనే మాస్ చిత్రాల కథానాయకుడిగా నేటి వరకు వెలుగుతూ వచ్చారు. ఖైదీ, ఘరానా మొగుడు, అల్లుడా మజాకా, యముడికి మొగుడు వంటి పలు మాస్ చిత్రాలు చిరంజీవిని అగ్రస్థానంలో నిలిపాయి. మాస్ ప్రేక్షకుల పాలిటి ఏకైక కథానాయకుడిగా ఆయన ఎదిగారు. అయితే, ఎన్టీఆర్ లా ఆయన కొన్ని క్లాస్ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అవార్డులు కూడా అందుకున్నారు. శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ అటువంటి చిత్రాలు. అన్నయ్య, హిట్లర వంటి చిత్రాలు ఆయనను అనురాగ పాత్రుడైన హీరోగా నిలబెట్టాయి. ఇక, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఇంద్ర, ఠాగూర్. ఈ సినిమాలు నేటి రాజకీయ రంగ ప్రవేశానికి ఆయనకు పునాదిరాళ్లుగా పనిచేశాయని చెప్పవచ్చు. అన్యాయాలను, అక్రమాలను ఎదిరించే కథానాయకుడిగా ఆయనకు ఈ సినిమాలు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఏర్పాటు చేసుకున్న తీరు ఠాగూర్ సినిమా కథనాన్నే తలపిస్తాయి. ఈ రకంగా చూస్తే చిరంజీవి అందరివాడు అవుతారా అనే ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది.
ఇక, ఎన్టీరామారావు రాజకీయ రంగ ప్రవేశానికి ముందు పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఏ మాత్రం పోలిక లేదు. కాంగ్రెసుకు ఆ రోజుల్లో ప్రత్యామ్నాయం లేదు. వామపక్షాలు కాంగ్రెస్ ను ఎదిరించలేని స్థితిలో ఉన్నాయి. మరో పార్టీ లేదు. దీంతో దూకుడుడా వచ్చిన ఎన్టీఆర్ కు ఆ పరిస్థితులు కలిసి వచ్చాయి. అంతేకాకుండా కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రధాన నినాదంగా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పేదలే దేవుళ్లు, నక్సలైట్లే నిజమైన దేశభక్తులు వంటి ఆకర్షణీయమైన ప్రకటనలు చేశారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారు. పేదవాడికి కూడు, గుడ్డ, నీడ అందించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమని గొంతెత్తి నినదించారు. ఇదంతా ఎన్టీఆర్ ఇమేజ్ కు తోడైంది. కానీ ఇప్పుడా పరిస్థితిలు లేవు. రాజకీయాల్లో శూన్యత ఉందని చిరంజీవి భావిస్తున్నప్పటికీ అంత స్పష్టంగా లేదు. సమాజం ముక్కముక్కలుగా ఫ్రాగ్మంటేషన్ కు గురైంది. ఇవ్వడానికి ప్రజాకర్షక నినాదాలు లేవు. అవినీతి రహిత సమాజం, సామాజిక న్యాయం వంటి నినాదాలు ఏ మేరకు పనికి వస్తాయో అంతు బట్టని పరిస్థితి. అయితే, చిరంజీవి ప్రధానంగా పాజిటివ్ దృక్పథం మీద, పార్టీ నిర్మాణం మీద ఆధారపడినట్లు కనిపిస్తున్నది. పటిష్టమైన నిర్మాణం, సామాజిక వర్గాల ఆదరణ తనకు కలిసి వస్తుందని, దానికి సినిమా ఇమేజ్ పనికి వస్తుందని ఆయన భావిస్తూ ఉండాలి. అయితే, ఆయన ఎన్టీఆర్ లా ప్రభంజనం సృష్టించలేకపోయినా మార్పు కోసం విజయాన్ని అందుకోగలరేమో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications
