వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్, వైయస్సార్ మహానేతలా?

By Pratap
|
Google Oneindia TeluguNews

NTR-YS Rajasekhar Reddy
రాష్ట్రంలో మహానేతల సృష్టికి, వారి వారసత్వ స్థిరత్వానికి రాజకీయాలు పోటీ పడుతున్నాయి. దివంగత నేతలు ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర రెడ్డిలను మహానేతలుగా నిలబెట్టడానికి రెండు అగ్రకులాల నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారి వారసులుగా చెప్పుకుని రాజకీయాధికారం సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్లు, కమ్మ కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని పంచుకుంటున్నాయి. మధ్య మధ్యలో కొద్ది కాలం పాటు ఇతర కులాల నాయకులు ముఖ్యమంత్రులుగా వచ్చినప్పటికీ వారు పూర్తిగా అధికారాన్ని అనుభవించిన దాఖలాలు లేవు. రెడ్డి, కమ్మ కులాల మధ్య వైరుధ్యాలు, వారి కులాల మధ్య అంతర్గత వైరుధ్యాలు మాత్రమే ఇతర కులాల నాయకులు ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. అంటే సంధి కాలంలో మాత్రమే. మిగతా కాలమంతా ఈ రెండు కులాల నాయకులు మాత్రమే అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నారు.

రెండు కులాలు అధికార వాంఛలో భాగంగానే అటు ఎన్టీఆర్ ను, ఇటు వైయస్సార్ ను మహానేతలుగా చిత్రీకరించి వారి వారసులుగా ఆ కులాల నేతలు రాజ్యాధికారం కోసం పోటీ పడుతున్నాయి. వైయస్ ను సాక్షి దినపత్రికలో మహా నేతగా రాయడం ఇందులో భాగమే. గతంలో ఎన్టీఆర్ గానీ ఇటు వైయస్సార్ గానీ చేసింది ఒక్కటే. వీరిద్దరు పేదలకు విరివిగా సంక్షేమ పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మాట తప్పకుండా వాటిని అమలు చేశారు. అందువల్లనే రాష్ట్రంలో మరో నాయకుడికి లేని ప్రజాదరణ ఈ ఇద్దరు నాయకులకు ఉంది. వారసులుగా చెప్పుకుంటూ వారి వారసులుగా అధికారాన్ని చేపట్టిన వారు వాటిని అమలు చేసే స్థితిలో లేరు. ఎన్టీఆర్ వారసుడిగా చెప్పుకుంటూ తొమ్మిదేళ్లు పాలించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. దానివల్ల ఆయన ప్రజాదరణ కోల్పోయారు. ఎక్కడ చంద్రబాబు దెబ్బ తిన్నారో వైయస్సార్ ఆక్కడ ప్రారంభమయ్యారు. ఎన్టీఆర్ పథకాలను పునరుద్ధరించడమే కాకుండా వాటికి మరిన్ని ఆకర్షణలు చేర్చడాన్ని, ప్రజలకు మరింతగా ఆర్థిక వెసులుబాట్లు కల్పిస్తూ పథకాలు రూపొందించి ప్రకటించి, వాటిని అమలులోకి తెచ్చారు. దాంతో ఆయన ప్రజాదరణను కూడగట్టుకోగలిగారు. దానికితోడు, వైయస్సార్ తన కోటరీని, తన అనుచర గణాన్ని విస్తృతంగా పెంచుకున్నారు. ఇది ఎన్టీఆర్ కు లేని అదనపు రాజకీయ ఎత్తుగడ. వైయస్సార్ రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు చంద్రబాబు అనుసరిస్తూ వస్తున్నారు. కానీ సంక్షేమ పథకాలకు గండి కొట్టిన పేరును మూటగట్టుకున్నారు. అందువల్ల వైయస్సార్ కు చంద్రబాబు పోటీ ఇవ్వలేకపోయారు.

వైయస్సార్ రాజకీయాల వల్ల ఒక ప్రాంతం, ఒక కులం ఆధిపత్య రాజకీయాలు బలపడడానికి దోహదం చేస్తే, ఎన్టీఆర్ రాజకీయాలు బిసిలు రాజకీయాల్లో ఎదిగి రావడానికి ఉపయోగపడ్డాయి. తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. సొంత రాజకీయ సిద్ధాంతాలతో, ఆలోచనలతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం వల్ల, నిర్ణయాధికారం పూర్తిగా ఆయనదే కావడం వల్ల, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సందర్భం వల్ల ఆ అదనపు ప్రయోజనాలు తెలుగు ప్రజలకు లభించాయి. వైయస్సార్ వల్ల ఈ మాత్రం ప్రయోజనం కూడా చేకూరలేదు. సంక్షేమ పథకాల వల్ల నిరుపేదలకు తాత్కాలిక ఊరట మాత్రమే కలుగుతూ వచ్చింది. అయితే, వీరిద్దరి సంక్షేమ పథకాలను కొనసాగించలేని పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ గిలగిలలాడిపోతూ వచ్చింది. అలా గిలగిలలాడుతూ వచ్చిన సందర్భంలోనే తెలుగుదేశం పార్టీలో అధికారం మారింది. ఎన్టీఆర్ చేతుల నుంచి చంద్రబాబు చేతిలోకి అధికారం వచ్చింది. వైయస్సార్ జీవించి ఉంటే సంక్షేమ పథకాలను అమలు చేయడం ఆయన వల్ల కూడా అయ్యేది కాదేమో. తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య వైయస్సార్ పథకాలను తిరగదోడుతున్నారు. ఈ స్థితిలో వైయస్సార్ పథకాలకు గండికొడుతున్నారని విమర్శలు చేస్తూ వైయస్సార్ కుమారుడు వైయస్ జగన్ అధికారాన్ని అందిపుచ్చుకోవడానికి చెమటోడుస్తున్నారు.

తమ తమ కాలపరిస్థితుల్లో తమ వంత పాత్రను నిర్వహించిన నాయకులుగా మాత్రమే ఎన్టీఆర్ గానీ వైయస్సార్ గానీ నిలబడుతారు కానీ మహానేతలుగా నిలువలేరు. మహా నేతలుగా నిలపడానికే రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఎన్టీఆర్ విగ్రహాలు స్థాపించారు. ఇప్పుడు జగన్ వైయస్సార్ విగ్రహాలను స్థాపించడానికి పూనుకున్నారు. అంతేగాని, ఎన్టీఆర్, వైయస్సార్ సామాజిక విప్లవానికి, రాజకీయ విప్లవానికి కారణమైన నేతలుగా కీర్తినందుకోలేరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X